హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ధాన్యం దారి మళ్లింపును నిరోధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సోమవారం పలు రైస్‌మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ రూరల్, హైదరాబాద్ సిటీ-1, హైదరాబాద్ సిటీ-2, నల్లగొండ, ఆర్సీ పురంలోని 8 విజిలెన్స్ బృందాలు.. మహబూబాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, నల్లగొండ, కామారెడ్డి, నిజామాబాద్‌లో సోదాలు చేపట్టినట్టు ఆమె వెల్లడించారు. మొత్తం 19 మిల్లులను తనిఖీ చేయగా.. 1.90 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని దారి మళ్లించినట్టు గుర్తించామని చెప్పారు. ఈ మొత్తం విలువ సుమారు రూ.60 కోట్లకు పైగా ఉంటుందని అంచనావేశారు.
14 మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)మళ్లింపు జరిగినట్టు గుర్తించారని తెలిపారు. రికార్డుల నిర్వహణ సరిగాలేని 5 మిల్లులకు నోటీసులు జారీచేశామని, పెద్దపల్లి జిల్లాలోని జానకీరామ ఇండస్ట్రీస్ మిల్లును తీవ్రమైన ఉల్లంఘనల కారణంగా మూసివేయించినట్టు చెప్పారు. కామారెడ్డి, నిజామాబాద్‌లో సుమారు రూ.19.73 కోట్ల విలువైన ధాన్యం కొరత, సూర్యాపేటలో రూ.19.32 కోట్ల విలువైన ధాన్యం మళ్లింపు, నారాయణపేటలో రూ. 15.91 కోట్ల విలువైన ధాన్యం అ దృశ్యం, పెద్దపల్లిలో రూ.11.38 కోట్ల విలువైన కొరత, మహబూబాబాద్‌లో రూ.4.86 కోట్ల విలువైన ధాన్యం మళ్లింపు, రంగారెడ్డి రూ.88 లక్షల విలువైన సీఎంఆర్ స్టాక్ మ ళ్లింపును గుర్తించినట్టు వివరించారు. తప్పు చేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్నామని, అక్రమారులను బ్లాక్‌లిస్ట్‌లో పె ట్టేందుకు ఆదేశాలు జారీచేశామని తెలిపారు.