హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): పేదోళ్ల పొట్టలకొట్టి.. పెద్దోళ్లకు దోచిపెట్టినట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలన కొనసాగుతున్నదని ప్రతినిధి బృందం సభ్యులు దుయ్యబట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఇటీవల హైడ్రా కూల్చివేతల ప్రాంతాలను ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డితో కూడిన బృందం పరిశీలించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆక్రమించిన రూ.1,100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా మధుసూదనాచారి, ఇతర నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? అంటూ హైడ్రా తీరును ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆ ప్రభుత్వ భూమిలో ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌ను హైడ్రా అధికారులు తొలగించిన 24 గంటల్లోనే తిరిగి ఆక్రమణదారులు ఫెన్సింగ్ నిర్మించినా చూసీచూడనట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి దీని వెనుకు ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రభుత్వ భూముల్లోని పేదలను బయటకు వెల్లగొట్టి, పెద్దలకు వాటిని కట్టబెడుతున్నదని విమర్శించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నదని ధ్వజమెత్తారు.

మూసీ నదిపై ఆక్రమణలను కూల్చకుండా, సుందరీకరణ, రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టంచేశారు. మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ భూములను ఆక్రమించి జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేయకుండా చేసే ప్రణాళికలన్నీ కోట్లాది రూపాయలను కాజేసేందుకేననే విషయాన్ని ప్రజలు గ్రహించాలని హితవు పలికారు. మూసీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, నాయకుడు కార్తీక్‌రెడ్డితో కలిసి వారు పరిశీలించారు.
ఆదిత్య నిర్మాణ సంస్థ మూసీ బఫర్‌జోన్‌ను ఆక్రమించిందనే విషయం తెలిసినా.. అటువైపు హైడ్రా కానీ, కాంగ్రెస్ సర్కారు గానీ పోవడమే లేదని విమర్శించారు. ఇటీవల మూసీనదికి వచ్చిన వరదల్లో ఆదిత్య ఆక్రమణల బాగోతం బయట పడిందని తెలిపారు. బఫర్‌లో పేదోడు కట్టుకున్న చిన్న ఇంటిని కూడా కనికరం లేకుండా కూల్చిన కాంగ్రెస్ సర్కారు, హైడ్రా అధికారులు.. మూసీని ఆక్రమించి పెద్దలు కట్టిన ఆదిత్య నిర్మాణాలను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. ఇంట్లో ఉండే సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకుండా, కనీసం చిన్నారుల కంటతడి చూసి కూడా కరుణించనీ హైడ్రా.. ఈ నిర్మాణాన్ని ఎందుకు నేలమట్టం చేయలేదని నిలదీశారు.