హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): జిన్నింగ్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిం చి, పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు గురువారం పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరి కొనుగోళ్లపై పర్యవేక్షణకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు పత్తి కొనుగోళ్లపై కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై సమగ్ర వివరాలు అందించే విధంగా ఒక వెబ్ పోర్టల్ తయారు చేసినట్టు తెలిపారు. దీంతో కొనుగోలు, రిజెక్ట్ చేసిన పత్తి వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని రైతులకు మంత్రి సూచించారు. పత్తి అమ్ముకోవడంలో సమస్యలు ఎదురైతే వాట్సాప్ (8897281111) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.