Mid Day Meals | మహబూబ్‌నగర్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్‌ను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా, పురుగుల అన్నం పెడుతూ వారి జీవితాలతో ఆటలాడుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనే నిదర్శనం.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ మధ్యాహ్నా భోజనంలో ఓ జెర్రి ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై భోజనం తినకుండా పడేశారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా సీరియస్‌గా తీసుకోలేదు. ఇలా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ప్రతి రోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ పురుగుల అన్నం తినలేకపోతున్నామని పలువురు విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు.