హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వినియోగదారులపై రూ.1200 కోట్ల మేరకు విద్యుత్తు చార్జీల పెంపునకు అనుమతించాలని కోరుతూ డిస్కంలు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి చేసిన ప్రతిపాదనలపై ఈ నెల 21 నుంచి 25 వరకు బహిరంగ విచారణ జరుగనున్నది. లైసెన్సింగ్‌కు కేవలం 12 రోజులు మాత్రమే ఉన్నందున పబ్లిక్ హియరింగ్ గడువును పొడగించబోమని ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు తెలిపారు. ఈఆర్సీ సలహామండలి సమావేశం శనివారం ఎర్రగడ్డలోని ఈఆర్సీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. వార్షిక రాబడి వివరాలు (ఏఆర్ఆర్) ప్రతిపాదనలను సకాలంలో సమర్పించడంలో డిస్కంలు విఫలమవుతున్నాయని అన్నారు. ఇది అంతిమంగా వినియోగదారులకు భారంగా మారనుందని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ ప్రతినిధి వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ 2023-24 టారిఫ్‌ను ఈ ఏడాది వసూలు చేసేందుకు అనుమతినిచ్చి 7నెలలుదాటిపోయిందని, ఈ ఐదు నెలలకు టారిఫ్‌ను సవరించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఆలస్యంగా ఏఆర్ఆర్ సమర్పించినందుకు పెనాల్టీలు వేసినా ఆ భారం వినియోగదారులపైనే పడుతుందని తెలిపారు.
ప్రస్తుతం చార్జీల పెంపునకు డిస్కంలు ఈఆర్సీకి చేసిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. 2024 -25లో మొత్తంగా రూ.1,200 కోట్లు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు డిస్కంలు ప్రతిపాదించాయి. ఎల్టీ క్యాటగిరీలో 300 యూనిట్లకు పైగా వాడుతున్న వారికి ప్రతి కిలోవాట్‌కు ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.10ని రూ. 50కు పెంచాలని ప్రతిపాదించాయి. ప్రస్తుతం రూ.30 ఫిక్స్డ్ చార్జీలు రూ.150కి పెరగనున్నాయి. ఇది 26 లక్షల మంది వినియోగదారులపై భారం పడనుంది. హెచ్‌టీ క్యాటగిరీలో రూ.7.65లుగా చార్జీలుగా నిర్ణయించారు. దీంతో 33కేవీ వినియోగదారులకు 50 పైసలు, 132 కేవీ వారికి రూపాయి చొప్పున చార్జీలు పెరగనున్నాయి. కరెంట్ బిల్లుల పెంపుతో రూ.700కోట్లు, ఫిక్స్డ్ చార్జీల ద్వారా రూ.100 కోట్లు, మొత్తంగా రూ.800 కోట్లు రాబట్టుకునే అవకాశమివ్వాలని కోరాయి. ఎల్టీ ఫిక్స్డ్ చార్జీల రూపేణా రూ.400 కోట్ల ఆదాయం పెంపునకు ప్రతిపాదించాయి. దీనిపై ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది.