హైదరాబాద్, ఏప్రిల్ 10, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన గ్రూప్-1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి 10 శాతానికి పెంచడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తమ ముందున్న వ్యాజ్యాలపై తుది ఉత్తర్వులు వెలువడేలోగా ప్రభుత్వం గ్రూప్-1 పోస్టుల్లో పెంచిన రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు జరిపితే అవి తామిచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని షరతు విధించింది.
ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో 33 ద్వారా పెంచిన ఎస్టీ రిజర్వేషన్లను విద్యా, ఉపాధి రంగాలకు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆ జీవోను సవాల్ చేస్తూ పీ శ్యాంసుందర్‌రెడ్డి ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీలకు ఆరు శాతమే రిజర్వేషన్లు ఉండాలని, పెంపుదల చెల్లదని, పెంచిన రిజర్వేషన్ల వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.