హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్‌కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వాటి సేకరణ, ఆ తర్వాత జరిగే డిజిటలైజేషన్ ప్రక్రియల్లో మరింత వేగం పెంచి సకాలంలో ముగించాలని స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలంగాణలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియపై ఆరా తీశారు. ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్న జిల్లాల ఎన్నికల అధికారులతో పవన్‌కుమార్ శర్మ నేరుగా మాట్లాడారు. ఆయా జి ల్లాల్లో వారు క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న ఉత్తమ వ్యూహాలు అడిగి తెలుసుకున్నారు.