కూసుమంచి, మే 16: ఖమ్మం జిల్లా పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యానికి మిల్లర్లు తరుగు తీస్తున్నారన్న విషయాన్ని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. తరుగు, అదనపు వసూళ్లు, తూకాల్లో తేడాలు వంటి అంశాలను పాలేరు రైతులు కాలంగి రాహుల్, భూక్యా మంగ్యా, సక్కు తదితరులు గురువారం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన విషయం తెల్సిందే.
ఆయా అంశాలపై విచారణ జరపాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓఎస్డీ అంజయ్య శనివారం స్థానిక డీటీ విజయ్‌బాబుతో కలిసి ఐకేపీ కొనగోలు కేంద్రానికి చేరుకొని విచారణ జరిపారు. ఫిర్యాదుదారులు కాలంగి రాహుల్, సక్కు అభిప్రాయాలతోపాటు ఏఈవో ప్రియాంక, కేంద్రం నిర్వాహకురాలు రేణుక వివరణ తీసుకున్నారు. మిల్లర్లను, ధాన్యాన్ని తోలిన లారీల యజమానులను విచారించారు.