Harish Rao | దేవరకొండరూరల్, సెప్టెంబర్ 1 : రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైనా పట్టించుకోరా? అని మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో ఎన్నాళ్లు చెలగాటమాడుతారని నిలదీశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ బాలుర గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం 13 మంది విద్యార్థులను ఎలుకల కరిచిన విషయం తెలిసిందే. దీంతో మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆదివారం వారు గురుకుల పాఠశాలను సందర్శించి ఎలుకలు కొరికిన విద్యార్థులను పరామర్శించారు. గురుకులంలో సమస్యలను తెలుసుకున్నారు. ఫ్యాన్లు పనిచేయక పోవడం వల్ల కిటికీలు తెరిచి పడుకుంటే వాటిలోంచి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. కిటికీలకు దోమ తెరలు లేక నిద్రకూడా సరిగా పోతలేమని వివరించారు. రగ్గులు, ట్రాక్ సూట్లు, కాస్మోటిక్ చార్జీలను ఇంతవరకు ఇవ్వలేదని వాపోయారు. భోజనం ఎలా ఉన్నదని 9వ తరగతి విద్యార్థిని అడుగగా గతంలో రైస్ బాగుండేదని, ఇప్పుడు బాగోలేదని తెలిపాడు. బాత్రూమ్ డోర్లు సరిగా లేవని, విద్యుత్తు పోయినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్సూపర్వైజర్ను అడుగగా, మందులు మాత్రమే ఇస్తామని, ఇంజెక్షన్స్ తమ వద్ద ఉండవని చెప్పారు. పాము, తేలు కాటుకు సంబంధించి యాంటీవీనమ్ ఇంజెక్షన్స్ కూడా తమ వద్ద లేవని, దగ్గర్లోని తూర్పుపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్తానని ఆమె తెలిపారు. పాఠశాల చుట్టూ చెట్లు, పొదలు ఉన్నందున పాములు, తేళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని, యాంటీవీనమ్ ఇంజెక్షన్స్‌ను అందుబాటులో ఉంచడంపైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని మాజీ మంతుల్రు మండిపడ్డారు. విద్యార్థులను పరామర్శించినవారిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్ కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి ఉన్నారు.
తొమ్మిది నెలల నుంచి గురుకులాలను పట్టించునే నాథుడే లేడని, కేసీఆర్ హయాంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాలను పట్టించుకోకుండా, ఇంత వరకు ఆ శాఖకు మంత్రిని నియమించకుండా సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, ఆయనకు హైదరాబాద్, ఢిల్లీ చక్కర్లు కొట్టేందుకే సమయం సరిపోతున్నదని మండిపడ్డారు. బోధనోపాధ్యాయులకు సమయానికి జీతాలు అందడం లేదని, వంట చేసేవారికి జీతాలు లేవని, కరెంట్ బిల్లులు, అద్దె బిల్లులు రాక గురుకులాల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.
కేసీఆర్ హయాంలోనే గురుకులాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించారని, 9 నెలల పాలనలో గురుకులాల పరిస్థితిపై ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా పెట్టలేదని గంగుల కమలాకర్ తెలిపారు. విద్యార్థులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో మునిగిపోయిందని విమర్శించారు.