భైంసా టౌన్, ఏప్రిల్ 23 : పంటలకు నీళ్లివ్వాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన రైతులు బుధవారం పొలంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల్లో వరి, 25 ఎకరాల్లో జొన్న, 25 ఎకరాల్లో నువ్వులు సాగయ్యాయి. దాదాపు 100 మంది రైతులు సాగు చేశారు. కెనాల్ ద్వారా నీటిని వదలకపోవడంతో పొట్ట దశకు వచ్చిన వరి, జొన్న, నువ్వుల పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి పంటలకు నీరు వదలాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.