మహబూబ్‌నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలు నేడు అడుగడుగునా నిజమవుతున్నాయి. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు, నేతలు ఏర్పాటుచేసిన సమావేశానికి కరెంటు కోత ఎదురై మరోసారి నిరూపితమైంది. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ, బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఏర్పాటుచేసిన మీడియా సమావేశం ప్రారంభమైన ఐదు నిమిషాలకే కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సమావేశం ముగిసే వరకు విద్యుత్తు రాలేదు. దీంతో స్పందించిన వారంతా కట్టెలతో ఫ్యాన్‌ను తిప్పుతూ నిరసన తెలిపారు. ‘ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు.. కరెంట్ కోసం తల్లడిల్లాల్సిన పరిస్థితి.’ అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాలో ఉదయం నుంచే కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో మంచినీటి కోసం బిందెలు పట్టుకొని మళ్లీ నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురిస్తుందని వారు హెచ్చరించారు. జిల్లాలో సాగునీరు లేక కరెంట్ కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోగా, పట్టణాల్లోనూ మొదలైన కరెంట్ కోతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననే విషయం గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. గత ఎన్నికల్లో కమలం పార్టీ నేతలు హస్తం పార్టీకి మద్దతు పలికారని, లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నదని విమర్శించారు. ఈ విషయంపై ఆ రెండు పార్టీల నేతలు చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎంపీ మన్నె మాట్లాడుతూ తనను మరోసారి ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, బీజేపీకి ఓటేస్తే ప్రయోజనమే ఉండదని పేర్కొన్నారు.