సుల్తాన్‌బజార్, జూలై 22: రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోస్ స్థలాలలో ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలను తక్షణమే తొలగించి ఉద్యోగులకు అప్పగించాలని బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గోపనపల్లిలోని ఆక్రమణలకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఏడవ రోజు వినూత్నరీతిలో పోస్టర్లను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల నుంచి పెద్దఎత్తున ఉద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ భాగ్యనగర్ తెలంగాణ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి చెందిన సుమారు 4000 మంది రిటైర్డ్, సర్వీసులో ఉన్న ఉద్యోగులు, సభ్యులకు న్యాయం జరిగేవరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టంచేశారు.
ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు కేటాయించిన స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. కబ్జా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వంలో లక్షల మంది ఉద్యోగులతో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు, కోశాధికారి ఏ శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రజియా బేగం, కేశ్య నాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.