శేరిలింగంపల్లి, జులై 29: టీజేఏసీ అధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న బీటీఎన్జీవోలు వినూత్న నిరసనకు దిగారు. నోటికి నల్ల వస్ర్తాలతో మౌనదీక్ష చేపట్టారు. గోపన్‌పల్లి స్థలాల ఆక్రమణకు నిరసనగా వారు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు రోజుకో ఓ రీతిలో వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బీటీఎన్జీవో కార్యాలయం నుంచి కాలనీ పార్క్ రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ గోపన్‌పల్లి స్థలాల భూఆక్రమణదారులపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆందోళనలో భాగ్యనగర్ టీఎన్జీవోస్ మ్యూచివల్ ఏయిడెడ్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సోసైటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదా బేగం, సంధ్య, నర్సింహరాజు, ఎక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటిని కలిసిన టీజేఏసీ
టీజేఏసీ అధ్వర్యంలో నాయకులు రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఏం ముజీబ్ హుస్సేనీ, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కోశాధికారి, సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ మంత్రిని కలిసి బీటీఎన్జీవోల సమస్యను విన్నవించారు. గోపన్‌పల్లిలోని ఇండ్ల స్థలాలను బీటీఎన్జీవోస్ హౌజింగ్ సొసైటీకి అప్పగించాలని కోరారు. న్యాయపరంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టు టీజేఏసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.