నర్సాపూర్ : రాష్ట్రంలో కుక్కల బెడదతో పాటు కోతుల ( Monkey ) బెడద ప్రజలను కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. నివారణకు ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయకపోవడంతో వాటి బారిన పడి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. నర్సాపూర్ ( Narsapur ) పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్ ( Nayeemuddin) వినూత్న ఆలోచనతో కోతులు పారిపోతున్నాయి.
నర్సాపూర్ మున్సిపాలిటీలో కోతులు ఇంట్లో ఉన్న సామగ్రిని ఎత్తుకు వెళ్లడమే కాకుండా జనాలను రక్కుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతుల బెడదను తట్టుకోలేక నర్సాపూర్ మున్సిపాలిటీలోని 6,7 వార్డులకు చెందిన ప్రజలు తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ నయీముద్దీన్కు మొర పెట్టుకున్నారు.
కోతుల బారి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆయన వినూత్న ఆలోచనను ఆచరణలో పెట్టారు. శుక్రవారం ఓ వ్యక్తిని తీసుకువచ్చి అతనికి గొరిల్లా ( Gorilla ) వేషం వేయించాడు. వేషం వేసిన వ్యక్తిని వార్డులలో తిప్పడంతో గొరిల్లా అనుకుని భయపడిన కోతులు వీధులను వదిలిపెట్టి చెరువు వైపు పరుగులు పెట్టాయి.
కాలనీలలో కోతుల సమస్య తొలగించినందుకు నయీముద్దీన్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీవాసుల ఇబ్బందులను చూడలేక, వారి కోరిక మేరకు ఈ చిన్న ప్రయత్నం చేశానని మాజీ వైస్ చైర్మన్ తెలిపారు. కోతుల బెడదను శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేయాలని సూచించారు.