ఖమ్మం రూరల్, జూలై 2 : ‘ ఇదివరకే ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు? ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలో పేదలకు అన్యాయం జరిగింది’ అని జలగంనగర్ కాలనీకి చెందిన బాధిత మహిళలు మంత్రి పొంగులేటి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తీగలవంతెన నిర్మాణంలో భాగంగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఖమ్మం జిల్లా రూరల్ మం డలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి హాజరయ్యారు. తొలుత 42మంది మహిళలకు మంత్రి ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. తిరిగి వెళ్లే సమయంలో మహిళలు పొంగులేటికి గోడు వెళ్లబోసుకున్నారు. తమ ఇండ్లు కూ లగొట్టి పట్టాలు ఎందుకు ఇవ్వడంలేదని ఆర్డీవో నర్సింహారావును ప్రశ్నించారు. దీంతో మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమింపజేశారు.
అనర్హులని తేలితే ఇండ్లను రద్దుచేయండి ; కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం
ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు లభించినట్టు గుర్తిస్తే.. ఇల్లు నిర్మాణంలో ఉన్నా సరే మధ్యలోనే రద్దుచేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఇండ్లను రద్దుచేయడంలో ఏమాత్రం వెనుకాడొద్దని, ప్రతి ఇల్లు అర్హుడికే దక్కాలని ఆయన స్పష్టంచేశారు. బుధవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి.. కలెక్టర్లతో ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ తదితర అంశాలను పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా ఒక్కో ఇంటికి అందిస్తున్న 40 మెట్రిక్ టన్నుల ఇసుక సజావుగా అందేలా చూడాలని, భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.