హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): చమురుశుద్ధి కర్మాగారాల్లో మౌలికవసతులు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. సోమవారం ముంబై కొలాబాలోని తాజ్ కన్వెన్షన్లో జరిగిన పెట్రోలియం, సహజ వాయువుశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంఘం చైర్మన్ తటరే సునీల్ దత్తాత్రేయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. చమురుశుద్ధి కర్మాగారాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై స్థాయీసంఘం సమీక్షించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేండ్లుగా దేశవ్యాప్తంగా చమురుశుద్ధి కర్మాగారాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. పెట్రోల్, డీజీల్, సంబంధిత ఉత్పత్తులు, వంటగ్యాస్ ధరలు, రవాణా, మారెటింగ్, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, వినియోగదారుల అవసరాలపై సమీక్షించారు. సమావేశంలో స్థాయీసంఘం సభ్యులతోపాటు పెట్రోలియం, సహజ వాయువుశాఖ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ సంస్థల ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. అనంతరం భోగి పర్వదినం పురస్కరించుకొని అధికారులు ఎంపీ రవిచంద్రను సతరించారు.