గద్వాల/అయిజ/రాజోళి/శ్రీశైలం, జూలై 7 : ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 12 గేట్లు ఎత్తి 79,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్‌ఫ్లో మొత్తం 1,10,852 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.316 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాం 19 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి 58,334 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
సోమవారం టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 52,498 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 61,760 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 76.450 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. టీబీ డ్యాం గేట్లు ఎత్తడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 61,190 క్యూసెక్కులుగా ఉన్నది. సుంకేసుల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 60 వేల క్యూసెక్కులు రావడంతో ప్రాజెక్టులోని 15 గేట్లు మీటర్ మేర ఎత్తి 57,310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నేడు తెరవనున్న శ్రీశైలం గేట్లు
శ్రీశైల జలాశయం వరద నీటితో నిండుకుండలా మారింది. జలాశయానికి సోమవారం ఎగువ నుంచి 1,67,669 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.80 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 192.5300 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 67,433 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు