Congress | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ)(వర్ధెల్లి వెంకటేశ్వర్లు) : ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దల మధ్య మాటల మంటలు.. మంత్రుల మధ్య మాటల యుద్ధాలు.. సొంత సోదరుల మధ్య అలకలు.. డీసీసీ అధ్యక్షులపై కత్తులుదూస్తున్న మంత్రులు.. ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు.. గల్లీ నుంచి గాంధీభవన్ దాకా, గాంధీభవన్ నుంచి ఢిల్లీ వరకు అంతటా ఒకటే సీన్. బయటికి ఐక్యత నటిస్తున్నా.. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ అతలాకుతలం అవుతున్నది. మంత్రులు ఒకరిపై ఒకరు లేఖలు రాస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో ఘర్షణ పడుతున్నారు. డీసీసీ అధ్యక్షులు మంత్రులతో ఢీకొంటున్నారు. ఫ్లెక్సీలు దగ్ధమవుతున్నాయి. ఢిల్లీకి ఫిర్యాదుల వరద కొనసాగుతున్నది. ప్రభుత్వం ఒక దిశలో సాగుతుంటే, పార్టీ మరో దిశలో నడుస్తున్నదన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. ఏకంగా ప్రభుత్వాన్ని నడిపే పెద్ద, పార్టీని నడిపే పెద్ద ఢిల్లీలో ‘నువ్వంటే నువ్వే’ అని అనుకున్నారనే వార్తలు వస్తున్నాయి. క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇచ్చినా నేతల తీరు మారడం లేదు. అధిష్ఠానం చూస్తూ ఊరుకుంటున్నది. ఇదంతా క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నది.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు కేంద్రబిందువుగా రాష్ట్ర అత్యున్నత నాయకత్వమే మారిందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. ముఖ్యనేతకు.. సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బయటకు ఐక్యత ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నా, కీలక నిర్ణయాలు, పదవుల పంపిణీ, పరిపాలనా వ్యవహారాలు, పార్టీ నిర్వహణ వంటి అంశాల్లో విభేదాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ విభేదాలకు ప్రతీకగా జూన్ 18న జరిగిన అనధికారిక క్యాబినెట్ సమావేశంలో చోటుచేసుకున్న ఘటనను కాంగ్రెస్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.
ధాన్యం సేకరణలో ప్రభుత్వం అపకీర్తిని మూటగట్టుకున్నది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ‘మీ శాఖ మీద మీకు నియంత్రణ ఉన్నదా?’ అని ముఖ్యమంత్రి నేరుగా నిలదీసినట్టు ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గ సమావేశంలోనే సీనియర్ నేతను బహిరంగంగా మందలించడం కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. దీని వెనుక మరో కారణం కూడా ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలపై తన అభిప్రాయాలను ఆయన తరచూ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖల రూపంలో తెలియజేస్తున్నారని చెప్తున్నారు. ఆ లేఖలు అధిష్ఠానంలో కీలకంగా ఉన్న ఒక నేత మళ్లీ ‘ఎఫ్‌వైఐ’ ట్యాగుతో తిరిగి సీఎంవోకే పంపిస్తున్నట్టు సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన సదరు సీనియర్ మంత్రి మీద సహచర మంత్రుల ముందు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాజాగా సన్నబియ్యం టెండర్లలో తక్కువ ధరకు బిడ్లు దాఖలవడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయం పత్రికల్లో చూసేవరకు సదరు మంత్రికి తెలియదని చెప్తున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పెద్దకు, రాష్ట్ర పార్టీ పెద్దలకు ఢిల్లీలో అనూహ్య సంఘటన జరిగినట్టు చర్చ జరుగుతున్నది. ‘నిన్ను నేనే పార్టీ అధ్యక్షుడిని చేశాను. ఇప్పుడు నాపైనే రాజకీయాలు చేస్తున్నవా?’అంటూ ప్రభుత్వ పెద్ద ప్రశ్నించినట్టు తెలిసింది. ‘నేను పార్టీ లైన్‌కు అనుగుణంగా పని చేస్తున్నా.. మీ అనుకూల మీడియానే నాపై దుష్ప్రచారం చేస్తున్నది’ అని పార్టీ పెద్ద ధీటుగానే బదులిచ్చినట్టు తెలిసింది. ఏఐసీసీలో కీలక నేత ఒకరు ప్రభుత్వ పెద్దకు అండగా ఉండగా, ఏఐసీసీ దూత నేత పార్టీ పెద్దకు తోడుగా ఉన్నట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. తనకు తెలియకుండానే తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారంటూ మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కడియం దూకుడు వెనుక ముఖ్యనేత అండ ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు బహిరంగంగానే ఆరోపించారు. క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో మంటలు మాత్రం చల్లారడం లేదు.
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మంత్రి ప్రభుత్వ కార్యక్రమాలకు కైలాశ్‌ను ఆహ్వానించడం లేదు, ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో కూడా ముద్రించడం లేదు. కాగా, ఆహ్వానం కోసం ఎదురుచూడటం తమ సంస్కృతి కాదంటూ డీసీసీ అధ్యక్షుడు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి కుటుంబంలోనే మరో చిచ్చు కూడా ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. తానూ, వెంకట్‌రెడ్డిది ఒకే కుటుంబం కాదని రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
గాంధీభవన్‌కు మండల కమిటీల సెగలు
జూలైలో టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకాలు రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు దారితీశాయి. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య (గతంలో బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్‌లో చేరారు), నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలంలో తన వర్గానికి చెందిన రావుగారి వెంకట్‌రెడ్డిని మండల అధ్యక్షుడిగా సిఫారసు చేశారు. అప్పటికే ఆ పదవిలో ఉన్న సామ వెంకట్‌రెడ్డి స్థానంలో మళ్లీ రావుగారి వెంకట్‌రెడ్డినే పీసీసీ అధ్యక్షుడు ప్రకటించడంతో, సామ వర్గం మద్దతుదారులు ఆగ్రహించి గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద ఆందోళన చేపట్టారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తొమ్మిది మండలాలకు అధ్యక్షులను ప్రకటించగా, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి వర్గం నిరసనలు చేపట్టింది. జాజిరెడ్డిగూడెం మండలంలో రెండు వర్గాలు రోడ్డెకి రాళ్లు రువ్వుకున్నాయి. స్థానిక ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి, ఎమ్మెల్యే మందుల సామేల్‌కు మధ్య కూడా విభేదాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి, స్థానిక సీనియర్లకు మధ్య వివాదం క్రమశిక్షణా కమిటీ వరకూ వెళ్లింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరుపై విచారణ జరిగింది. షబ్బీర్ అలీ పీసీసీ అధ్యక్షుడిపై తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేసినట్టు ఒక ఆడియో వాయిస్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జగిత్యాల డీసీసీ అధ్యక్ష పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో, మునుపు ఐదుగురికి అవకాశం లభించిన వెలమ సామాజికవర్గానికి ఈసారి ఒకటి కూడా దకకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీల్లో పాలన మొదలైన ఆరు నెలల్లోనే విభేదాలు తలెత్తాయి. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జకిడి శివచరణ్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.
ఈశ్వరమ్మ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో, శివచరణ్‌రెడ్డి తండ్రి జకిడి ప్రభాకర్‌రెడ్డి ఫొటోను ముద్రించకపోవడం సమస్యకు కారణంగా చెప్తున్నారు. మోతూరులో అభివృద్ధి పనుల టెండర్‌పై కమీషన్ల ఆరోపణలు, ఆలేరులో కాంగ్రెస్ నేతలే వర్గాలుగా విడిపోయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వరకూ వెళ్లడం చోటుచేసుకున్నాయి. ఇలా 48 నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయి వర్గపోరు నడుస్తున్నదని పలు సర్వేలు సూచిస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణా కమిటీ వరుసగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు.
సొంత పార్టీలో అసమ్మతి స్వరాలను అదుపులో ఉంచేందుకు, నాయకులను లొంగదీసుకొనేందుకు వారి రాజకీయ కదలికలతోపాటు కుటుంబ సభ్యుల వ్యవహారాలపై కూడా నిఘా పెట్టారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. వారి మీద కేసులు నమోదు చేయించి విధేయత కోసం అస్త్రంగా వాడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన ఓ అత్యంత కీలక నేత కుమారుడు ఇటీవల ఓ కేసులో చికుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సదరు పుత్రరత్నంపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆ నేత, తన భార్యతో కలిసి ముఖ్యనేత నివాసానికి వెళ్లి కేసు విషయంలో ఉపశమనం కల్పించాలని వేడుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఇదే తరహాలో గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడిపై కూడా భూ ఆక్రమణ ఆరోపణల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. మరో కాంగ్రెస్ నేత కుమారుడు పబ్‌లో పట్టుబడిన ఘటన కూడా తరచూ ప్రస్తావనకు వస్తున్నదని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ నాయకులపై నేరుగా కాకుండా వారి కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయంగా నియంత్రించే వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు పార్టీ నేతల అంతర్గత చర్చల్లో వ్యక్తమవుతున్నాయి.