హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ విధానం అమల్లోకి వస్తే జీఎస్టీతోపాటు వివిధ పన్నుల రూపంలో ఏటా రాష్ర్టానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడే ఆస్కారం ఏర్పడింది. బంగారు గుడ్లు పెట్టే కోడిని ఒకేసారి కోసుకొని తిన్నట్టుగా రియల్ ఎస్టేట్ మోజులో పడిన కాంగ్రెస్ సర్కారు, ఏటా ఆదాయాన్ని తెచ్చిపెట్టే పరిశ్రమలను మూతపడేసేందుకు హిల్ట్ పాలసీని తెరపైకి తెచ్చినట్టు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాలుష్యం పేరుతో హిల్ట్ పాలసీని తెచ్చిన రాష్ట్రప్రభుత్వం, ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలోని పారిశ్రామికవాడలను ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టింది. భూ వినియోగ మార్పిడి ద్వారా రాష్ర్టానికి వచ్చే ఆదాయాన్ని పక్కన పెడితే పరిశ్రమల ద్వారా వివిధ పన్నుల రూపంలో ఏటా వచ్చే ఆదాయాన్ని మాత్రం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా గుర్తించి రాష్ర్టాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మలిచేందుకు విశేషంగా కృషిచేసింది. రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు రావడంతోపాటు లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ హయాంలో అన్నిరంగాలతోపాటు పరిశ్రమల రంగం కూడా ఎంతగానో పురోగతి సాధించింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశీయ స్థూల ఉత్పత్తిలో తెలంగాణ తయారీ రంగం వాటా 2014-15లో కేవలం రూ.54,533 కోట్లు ఉండగా, 2023-24 నాటికి రూ.1,23,326 కోట్లకు చేరింది. దీన్నిబట్టి బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పారిశ్రామికరంగం ఏ విధంగా వృద్ధి సాధించిందో స్పష్టమవుతున్నది. అంతేకాదు, పారిశ్రామికంగం అభివృద్ధికి ఎంతో విప్లవాత్మకమైన టీజీ-ఐపాస్ చట్టాన్ని తెచ్చి పరిశ్రమల ఏర్పాటును ఎంతగానో ప్రోత్సహించింది.
దీనిద్వారా 2014-15 నుంచి 2023-24 వరకు 25,224 యూనిట్లకు అనుమతులు మంజూరు చేయగా, రూ.2,85,572.83 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతేకాదు, వీటిద్వారా 18,31,305 మంది యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మన రాష్ట్రం నుంచి 2024నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్లో తయారీరంగంలో 1,90,669 యూనిట్లు నమోదు కాగా, సేవల రంగం నుంచి 7,31,214 సంస్థలు కలుపుకొని మొత్తం 9,21,883 యూనిట్లు నమోదు కావడం విశేషం. బీఆర్ఎస్ హయాంలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఏ విధంగా వృద్ధి చెందాయో చెప్పేందుకు ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.
పారిశ్రామిక రంగం సజావుగా సాగిపోతున్న తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చీ రావడంతోనే ఫార్మాసిటీ రద్దు ద్వారా పెద్ద ఎత్తున అలజడి సృష్టించింది. దీంతో ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన వందలాది కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాయి. అనంతరం నూతన ఎంఎస్ఎంఈ పాలసీ పేరుతో దాదాపు ఏడాది కాలయాపన చేసి కొత్త యూనిట్లు ఏర్పాటు కాకుండా చేసింది. వారంవారం పరిశ్రమలకు భూముల కేటాయింపును నిలిపివేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారు. పెట్టుబడిదారుల్లో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించి బలవంతంగా ఇతర రాష్ర్టాలకు మరలిపోయేలా చేశారు.
ఇప్పుడు తాజాగా హిల్ట్ పాలసీ పేరుతో హైదరాబాద్ శివార్లలో అత్యంత విలువైన భూముల్లో కొలువుదీరివున్న పరిశ్రమను మూకుమ్మడిగా తరలించేందుకు చర్యలు చేపట్టింది. 22 పారిశ్రామికవాడలను కాలుష్యం పేరుతో మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దశాబ్దాలుగా చిన్నాచితకా పరిశ్రమలను నడుపుకొంటున్న వారిని ఔటర్ వెలుపలికి తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శివార్లలో వారికి భూములు ఇవ్వకుండానే ‘మీ దారి మీరే చూసుకోండి’ అనే చందాన వారిని ఉన్నపలంగా ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
దేశీయ స్థూల ఉత్పత్తిలో తెలంగాణ(జీఎస్డీపీ) తయారీ రంగం వాటా(రూ.కోట్లలో)

జూన్ 2024నాటికి ఉద్యమ్ పోర్టల్లో నమోదైన ఎంఎస్ఎంఈల వివరాలు

2014-15 నుంచి 2023-24వరకు వివిధ
వర్గాలకు టీ-ఐడియా, టీ-ప్రైడ్ ద్వారా
ఇచ్చిన ప్రోత్సాహకాలు(రూ. కోట్లలో)

2014-15 నుంచి 2023-24వరకు టీజీ-ఐపాస్ ద్వారా రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల వివరాలు
అనుమతించిన యూనిట్లు 25,224
వచ్చిన పెట్టుబడులు 2,85,572.83
లభించిన ఉద్యోగావకాశాలు18,31,305