Indrakaran Reddy | నిర్మల్ : పేదప్రజల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే సేవలు మరువలేనివని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జ్యోతిబా ఫూలే జయంతిని పురస్కరించుకుని నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యకు మార్గదర్శకుడు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని ధారపోసిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఫూలే ఆశయాలకు అనుగుణంగా, ఆయన చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నదని, రాష్ట్రంలో ఆడబిడ్డల విద్యాభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని బాలికలను విద్యవైపు మళ్లించేందుకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను నెలకొల్పిందని చెప్పారు. దేశం కోసం, సమాజ హితం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసిన మహానీయుల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, నిర్మల్ జిల్లా కేంద్రంలో ఫూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.