CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): అనుమానం పెనుభూతం అంటారు. ఒకసారి అనుమానం మొదలైందంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రస్తుతం అదే జరుగుతున్నది. రైతు రుణమాఫీ విఫలమవడం మొదలు హైడ్రా తదితర పరిణామాలతో రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు హస్తినకు పూసగుచ్చినట్టుగా చేరడం ప్రభుత్వ ‘పెద్ద’కు పెద్ద చిక్కులనే తెచ్చి పెట్టిందా? మొన్నటిదాకా రాహుల్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లినా చూపే బంగారంలా మారిందా?
ఈ నేపథ్యంలో పార్టీలోని పలువురు సీనియర్లే అధిష్ఠానంతో అగాధానికి కారణమని అనుమానిస్తున్న సీఎం రేవంత్ వారిపై గురి పెట్టారా? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇలాంటి సందేహాలపైనే విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అందుకే విపక్షాలపై రాజకీయ అస్త్రంగా వినియోగించాలని తెచ్చిన హైడ్రా చివరకు సొంత పార్టీలోని అనుమానితులపైకి వరుసగా ఎక్కు పెడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా తనకు ఆర్థికంగా, రాజకీయంగా దీటుగా ఉన్న మంత్రివర్గంలోని కొందరు సహచరులతో పాటు కాంగ్రెస్ కష్టకాలంలో అండగా నిలబడిన పల్లంరాజు, కేవీపీ వంటి వారిని సైతం హైడ్రా అస్త్రంతో దారికి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టుగా హస్తం వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ పదేపదే తన ప్రసంగాల్లో ఫాంహౌస్‌ల ప్రస్తావనకు తీసుకువస్తూ సొంత పార్టీలోని నేతలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారనే రాజకీయ విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి.
తగ్గిన రేవంత్ ప్రాభవం
రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయంటారు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు హస్తిన కాంగ్రెస్ తెలంగాణపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి రాహుల్‌తో పాటు ఢిల్లీ పెద్దలతో సంబంధాలు బలపడ్డాయి. తదనంతరం రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ బలం అమాంతంగా పెరిగింది. సోనియా, రాహుల్, ప్రియాంక మొదలు చాలామంది కాంగ్రెస్ పెద్దలు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివచ్చారు.
ఆపై కొంతకాలం పాటు హస్తినలో రేవంత్ హవా కొనసాగింది. కానీ గత కొన్ని నెలలుగా, మరీ ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత క్రమేపీ హవా తగ్గుముఖం పడుతూ వచ్చింది. అనేకసార్లు రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పటికీ రాహుల్, ప్రియాంకను కలిసే పరిస్థితులు కూడా లేకపోవడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రుణమాఫీ నేపథ్యంలో రాహుల్‌తో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రేవంత్‌రెడ్డి భారీ ఎత్తున ప్రణాళిక రూపొందించినా అది కార్యరూపం దాల్చలేదు.
తాను వచ్చేందుకు రాహుల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా పార్టీవర్గాలు తెలిపాయి. దీంతో పాటు సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు సైతం రాహుల్, ప్రియాంకను పిలిచేందుకు రేవంత్ కసరత్తు చేసినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సైతం ముఖం చాటేయడంతో రేవంత్‌కు హస్తినతో చెడిందనే అనుమానాలు బలపడ్డాయని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు.
తెర వెనక పరిణామాలపై సీఎం ఆరా!
అధిష్ఠానం దగ్గర తనకు మునుపటి వైభవం లేకపోవడానికి కారణాలేమిటనే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున ఆరా తీశారని పార్టీవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం, పార్టీలోని సీనియర్లు ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులను విశ్లేషించి అధిష్ఠానానికి పూసగుచ్చినట్లుగా చేరవేస్తున్నారనే అనుమానం ఆయనలో మొదలైంది. ఏకపక్షంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం, రూ.31వేల కోట్ల రుణమాఫీ కాస్తా రూ.18వేల కోట్లతోనే ముగియడం, హైడ్రాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, రియల్-నిర్మాణ రంగాలు కుదేలవడం, రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ కోసం నిరుపేదల ఇండ్ల కూల్చివేత..
ఇలా ఒకదానివెనక మరోటి చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం వేగంగా అధిష్ఠానానికి చేరడం సీఎంను ఇరకాటంలో పడేసిందని చెప్తున్నారు. అధిష్ఠానానికి అన్ని విషయాలు తెలిసి ఒక నిర్ణయానికి రావడంతో ఈ అంశాలపై సీఎం తన అభిప్రాయం, వాదన వినిపించే అవకాశాలు లేకుండా పోయాయని కీలక నేత ఒకరు చెప్పారు.
ప్రధానంగా రాహుల్‌ను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న నేతలెవరు అనే దానిపై ఆరా తీయగా ప్రభుత్వంలోని కొందరు సీనియర్లు సమాచారం చేరవేస్తున్నారనే స్పష్టత రేవంత్‌కు వచ్చిందని, దీనితో పాటు సోనియాతో ఏండ్ల తరబడి సత్సంబంధాలున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమె కోటరీకి సమాచారం చేరవేసి, అక్కడి నుంచి వివరాలు రాహుల్‌కు చేరవేశారనే సమాచారం కూడా ముఖ్యమంత్రికి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారనే దానిపై పూర్తిస్థాయి క్లారిటీ లేనప్పటికీ కొందరిని మాత్రం అనుమానించడం మొదలైందని, కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు బలాన్నిస్తున్నాయని సదరు నేత వివరించారు.
పల్లంరాజు మొదలు కేవీపీ దాకా!
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కానందున తనకున్న అధికారాన్ని వినియోగించుకొని వారిని ఇరకాటంలో పెట్టాలనే స్కెచ్‌ను ప్ర భుత్వ పెద్ద అమలు చేస్తున్నారని పార్టీ నేత లు కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నా రు. ఇందులో భాగంగా తొలుత విపక్షాలను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు తెరపైకి తెచ్చిన హైడ్రాను సొంత పార్టీలోని అనుమానిత సీనియర్ల వైపునకు మళ్లించారని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పల్లంరాజుకు చెందిన ఫాంహౌస్‌ను కూ ల్చేందుకు హైడ్రా చాలా ప్రయత్నాలు చేసిందని, ఢిల్లీ ఫోన్లకు తాళలేక చివరకు ఆయన తమ్ముడికి చెందిన నిర్మాణాల కూల్చివేతతో శాంతించారనే ప్రచారం ఉంది.
ఈ సమయంలోనే రాహుల్, మల్లికార్జున ఖర్గే దగ్గర పల్లంరాజు వంటి సీనియర్లు పెద్ద ఎత్తున చ ర్చ పెట్టి, రాష్ట్రంలో అసలేం జరుగుతుందనే వివరాలను వారి ముందుంచినట్టు తెలిసిం ది. రేవంత్‌కు ఇది అధిష్ఠానం వద్ద మరింత ప్రతికూల పరిస్థితులను తెచ్చి పెట్టిందని, ఆ సంకేతాలు బయటికి పోకుండా ఉండేందుకు తన అనుకూల మీడియాలో హైడ్రాకు రాహుల్ అండ ఉన్నట్టుగా వార్తలు రాయించుకున్నారనే ప్రచారం పార్టీలో విస్తృతంగా ఉంది. అనంతరం ప్రభుత్వంలో తనకు ప లు రకాలుగా దీటుగా నిలిచే వారిపైకి కూడా హైడ్రాను గురి పెట్టి, వారిని దారిలోకి తెచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.