వేములవాడ, డిసెంబర్ 24: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక సరఫరాను సులభతరం చేశామని, ఉచితంగా అందజేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇసుక దొరక్క నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ‘సారూ.. ఇంటి నిర్మాణానికి ఇసుక ఇప్పించండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోనాయపల్లికి చెందిన షేక్ సమీనా అధికారులను వేడుకుంటున్న పరిస్థితి ఇందుకు నిదర్శనం. ఇసుక కొరతతో నవంబర్ రెండో తేదీన పనులు ఆగిపోయినట్టు సమీనా ఆవేదన వ్యక్తంచేసింది. ఇసుక కావాలని అధికారులను 52 రోజులుగా కోరుతున్నా అందడం లేదని వాపోయింది. బుధవారం నేరుగా తహసీల్దార్ కార్యాలయ అధికారుల కాళ్లావేల్లా పడినా కనికరించడం లేదంటూ గోడువెల్లబోసుకున్నది.