గుర్రంపోడ్, మే 5: కాంగ్రెస్ సర్కార్ ఓ నిరుపేదపై కక్షగట్టింది. బీఆర్ఎస్ సభకు వెళ్లాడనే కారణంతో ఇందిరమ్మ ఇల్లు కట్ చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. గుర్రంపోడ్ మండలం పాల్వాయికి చెందిన ముండ్ల సాయిది నిరుపేద కుటుంబం. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోగా అధికారులు విచారణ చేపట్టి ఇల్లు మంజూరు చేశారు. కేసీఆర్ అభిమాని అయిన ముండ్ల సాయి గత నెలలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా హాజరయ్యాడు. ఇది తెలిసిన కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితానుంచి అతని పేరు లేకుండాచేశారు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సాయి తన పేరును జాబితా నుంచి ఎందుకు తొలగించారని పంచాయతీ కార్యదర్శి యాదయ్యను అడిగితే.. రెండో విడతలో చూద్దామని చెప్పినట్టు బాధితుడు వాపోయాడు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలను అడిగితే ‘నువ్వు బీఆర్ఎస్ మీటింగుకు వెళ్లినవ్ కదా? బీఆర్ఎస్ వాళ్లకు ఇండ్లు ఇవ్వం’ అని చెప్పినట్టు సాయి పేర్కొన్నాడు. తాను నిరుపేదనని, ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని పేర్కొన్నాడు.