Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : ఒక్కో ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులకు మించొద్దని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని, ఎంపిక ఎంత వరకు పూర్తయితే అంతవరకు ఏరోజుకారోజు ఇన్చార్జి మంత్రుల నుంచి ఆమోదం తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారుల్లో ఎవరైనా అనర్హులని తేలితే ఇండ్లు నిర్మాణం మధ్యలో ఉన్నా పథకాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు.
లిస్ట్-1, లిస్ట్-2 , లిస్ట్-3తో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి 20 వరకు జిల్లాకో మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 4న జరగనున్న నీట్ పరీక్షకు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, సీసీఎల్ఏ డైరెక్టర్ మకరంద్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, లా అండ్ ఆర్డర్ డీఐజీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.