హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : పట్టణ ప్రాంతాల్లో ఇంటి జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు లేనట్టేనా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. మురికివాడల్లో ఉంటున్న పేదలకు ఇన్-సిటూ పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటి జాగాలు ఉన్నవారికి మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయాల్సి ఉన్నదని అధికారులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినప్పటికీ పట్టణాల్లో ఇంటి జాగా ఉన్నవారి విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. పట్టణా లు, నగరాల్లోని ప్రభుత్వ జాగాల్లో అనాదిగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నవారికి గతంలో ప్రభుత్వాలు 60 గజాల చొప్పున ఇంటి పట్టాలిచ్చేవి. కానీ, మురికివాడలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా వారికి అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ‘ఇన్-సిటూ’ అనే ఈ విధానం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏదో విధంగా ఇంటి జాగాను సమకూర్చుకున్నప్పటికీ అందులో ఇల్లు నిర్మించుకునే స్థోమత వారికి లేకపోవడంతో అద్దె ఇండ్లలోనే జీవనం సాగిస్తున్నారు. ఇలాంటివారి కోసం ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలు జారీచేయలేదు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఇంటి జాగాలున్నవారికి ప్రాధాన్యతనిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటివరకు ఇంటి స్థలం ఉన్న 2,03,744 మందికి మాత్రమే ఇండ్లు మంజూరు చేసింది. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలకు చెందినవే. పట్టణ ప్రాంతాలకు చెందిన పేదలకు ఇంతవరకు ఇండ్లు మంజూరు చేయలేదు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే 10 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో మూడున్నర లక్షల దరఖాస్తులు సొంత జాగాలున్నవారివే. అయినా వారికి ఇండ్లు మంజూరు కాలేదు. కేవలం మురికివాడల్లో మాత్రమే అపార్ట్మెంట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్లో సైతం ఇదే పరిస్థితి ఉన్నది. పట్టణాల్లో సొంత జాగాలున్నవారిని ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తున్నదని పలువురు దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమను ధనికుల జాబితాలో కలిపారా? అని కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో జాగాలున్నవారికి ఇండ్లు మంజూరు చేయాలంటే ప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఇంటి జాగా పత్రాలు, ఇంటి నిర్మాణ నమూనా, కుటుంబ ఆదాయం తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉన్నదని చెప్పారు. పట్టణాల్లో నివసించేవారికి చిరునామాలు కూడా సరిగా ఉండవని, వారు ఒక జిల్లా పరిధిలో ఉంటే.. ఇంటి జాగా మరో జిల్లా పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ.. ఇలాంటివారి విషయంలో ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేస్తే ఇండ్లు మంజూరు చేసేందుకు వీలవుతుందని వివరించారు.
రాష్ట్రంలో సగం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నది. 80 లక్షలకుపైగా కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నా యి. ప్రభుత్వం తొలి విడతలో నిర్మించ తలపెట్టిన 4.5 లక్షల ఇండ్లలో కనీసం సగభాగం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు దక్కాల్సి ఉన్నది. మురికివాడల్లో నివసిస్తున్నవారితోపాటు అద్దె ఇండ్లలో నివసిస్తున్న పేదల సంఖ్య కూడా గణనీయంగా ఉన్నది. వారిలో ఇంటి జాగాలున్నవారికి ప్రభుత్వం న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.