Grama Sabha | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 23 : ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో పేదలకు అన్యాయం జరిగిందని ప్రజలు తిరగబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, అధికార పార్టీ నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.
రాష్ట్రంలో మూడో రోజు గురువారం నిర్వహించిన గ్రామసభలు సైతం రణరంగంగా మారాయి. పథకాలు కచ్చితంగా వస్తాయన్న ఆశతో గ్రామసభలకు పోటెత్తినవారంతా జాబితాలో పట్టుమని పదిమంది అర్హుల పేర్లు కూడా లేకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. అర్హులకు పథకాలు అందించని గ్రామసభలు ఎందుకంటూ చాలాచోట్ల అధికారులను అడ్డుకొని సభలను బహిష్కరించారు. పోలీసు నిర్బంధం నడుమ గ్రామసభల నిర్వహణపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. రైతుల నిలదీతలతో రుణమాఫీ ఇంకా పూర్తిగా కాలేదని మంత్రి దామోదర ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ములుగులో మంత్రి సీతక్క ఇలాఖాలో అన్ని అర్హతలున్నా కావాలనే తన పేరులేకుండా చేశారని ఓ వ్యక్తి సభలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం నిర్వహించిన గ్రామసభలో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఊహించని రీతిలో నిరసన సెగ తగిలింది. ‘రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న రుణమాఫీ ఏమైంది? రూ.15 వేల రైతుభరోసా రూ.12 వేలకు ఎందుకు తగ్గింది?’ అని రైతులు, బీఆర్ఎస్ సీనియర్ నేత షేక్ జుబేర్ తదితరులు ప్రభుత్వ పథకాలపై వారిని ప్రశ్నించారు. ‘పోడు భూములకు పట్టాలెందుకు ఇస్తలేరు? ఆత్మీ య భరోసాకు ఉపాధి హామీతో లింక్ పెట్టడడం ఏమి టి? మున్సిపాలిటీలో ఉపాధి హామీ పథకం ఉండదు కదా? మరి వ్యవసాయ కూలీలకు ఎలా న్యాయం చేస్తారు? ’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన పోచారం.. ‘ఏయ్.. కూర్చోవయ్యా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కొన్ని బ్యాంకులు జాబితాను సరిగా ఇవ్వనందున కొంత మందికి మాఫీ కాని మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. పట్టణాల్లో ఉండే కూలీలకు న్యాయంపై ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో అధికారుల తీరుపై బ్లాక్ కాం గ్రెస్ మండల అధ్యక్షుడు సంజయ్ గుండావార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదని మండిపడ్డారు. ‘ఇది ప్రజాపాలనా? రజాకార్ పాలనా?’ అని నిలదీశారు. ఇష్టం వచ్చినట్టు జాబితాను ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ తండాలో ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో గ్రామసభ ఏర్పాటు చేయగా తండావాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. పంచాయతీలో గ్రామసభ నిర్వహిస్తామని అధికారులు చెప్పగా అధికార పార్టీ నాయకులు వీరంగం సృష్టించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రాలేమని తహసీల్దార్, ప్రత్యేకాధికారి రవీందర్ చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. గందరగోళం నెలకొనడంతో అధికారులు జహీరాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్ఐ ప్రసాద్‌రావు, సిబ్బంది తండాకు చేరుకొని నాయకులకు నచ్చజెప్పి తండాలోనే సభ నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మల్లపురంలో భూములున్న వారికి రైతు కూలీ కింద రూ.12 వేల ఆర్థికసాయం ఎలా ఇస్తారని, అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దాంతో ‘డబ్బులు తీసుకొని తాగి ఓట్లేస్తే ఇట్లనే ఉంటది’ అంటూ గ్రామస్తులతో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. ‘పథకాలు ఎవరికివ్వాలో మాకు తెలుసు.. అందరికీ రావు’ అని తెగేసి చెప్పారు.
‘పథకాలన్నీ కాంగ్రెస్ వాళ్లకే ఇస్తరా? అర్హులకు ఇవ్వరా?’ అని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మం డలం గూడూరు వాసులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని నిలదీశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు రాలేదని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలవి, ఆ పార్టీ అనుయాయుల పేర్లే వచ్చాయని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పినా శాంతించలే దు. ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నామ ని, ఇంకెన్ని సార్లు చేయాలని నిలదీశారు.
సంక్షేమ పథకాలు అర్హులకే వర్తింపజేయాలని నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్‌లో యువకుడు వంగాల విజయ్ పంచాయతీ ఆవరణలో దీక్ష చేపట్టాడు. బుధవారం గ్రామంలో జరిగిన సభ లో ప్రదర్శించిన అర్హుల జాబితాల్లో సగానికి పైగా అనర్హుల పేర్లే ఉన్నాయని, వారిని తొలగించి నిరుపేదలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాడు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడులో గ్రామసభను అడ్డుకుంటారన్న కారణంతో పలువురు గ్రామస్థులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మరికొందరిని ఉదయం నుంచి హౌ స్ అరెస్టు చేశారు. భారీగా పోలీసు బందోబస్తు మధ్య అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఏపీఎస్సీ కానిస్టేబుళ్లు ముందుగానే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలిమినేడులో పలు కంపెనీల కోసం ప్రభుత్వం ఇటీవల భూసేకరణ చేపట్టింది. పరిహారం పెంచుతామని, భూములు కోల్పోయిన వారికి ఇండ్ల స్థలాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అవి నెరవేర్చిన తర్వాతే గ్రామసభలు నిర్వహించాలని, ఒకరోజు ముందే గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. విషయం తెలిసి పోలీసులు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి, రవి, గణేశ్, బుగ్గరాములు, రాంరెడ్డి, చంటి, నర్సింహ, వెంకటేశ్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు.
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధి రామయ్యగూడ ఎంఐజీ కాలనీలో వార్డు సభకు ఎవరూ రాకపోవడంతో ప్రత్యేక అధికారి ఖాళీ కుర్చీలకే జాబితాలను చదివి వినిపించారు. దరఖాస్తు ఫారాలు లేక అర్జీ పెట్టుకొనేందుకు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. జిరాక్స్ కేంద్రాల వద్ద కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు దరఖాస్తులు స్వీకరించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో మండల ప్రత్యేకాధికారి బాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒక అధికారి అయ్యుండి గ్రామసభలో గత ప్రభుత్వంపై ఎలా విమర్శలు చేస్తారని గ్రామస్థులు, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై అధికారితో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుడు అజ్మీరా కిషన్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ప్రత్యేకాధికారి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీటీసీ పసునూటి రమేశ్ ఆధ్వర్యంలో స్థానికులు రోడ్డు పై బైటాయించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే గ్రామసభల పేరిట నాటకమాడుతున్నారని ధ్వజమెత్తారు.
చెన్నారావుపేట మండలం జల్లి గ్రామసభకు ఎమ్మె ల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కాగా ప్రజలెవరూ మాట్లాడకుండా పోలీసులు నిర్బంధం విధించారు. అర్హుల జాబితాపై ఎమ్మెల్యేను ఓ మహిళ ప్రశ్నించే ప్రయత్నం చేయగా పోలీసులు, కాంగ్రెస్ నాయకులు అడ్డుపడి అక్కడి నుంచి లాక్కెళ్లారు.
ఇండ్లు లేని వారివి కాకుండా ఉన్న వారి పేర్లను ఎలా జాబితాలోకి ఎక్కించారని కలెక్టర్ ఎదుటే గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో గ్రామసభకు కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు ఎందుకు రాలేదని గ్రామస్తులు ప్రశ్నించారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించగా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ అసహనం వ్యక్తంచేశారు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండ లం మన్నెగూడెం సభలో రేషన్ కార్డుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ నాయకుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో గొడవ మరింత పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు.
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ చేయలేదని, మిషన్ భగీరథ పథకం ద్వారా ఏ ఒక్క గ్రామంలోనూ సరైన పనులు చేపట్టలేదని విమర్శించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డికి చుక్కెదురైంది. గురువారం నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌లో జరిగిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వెంటనే స్పందించిన ప్రజలు ఎమ్మెల్యేకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏ గ్రామంలోనూ మిషన్ భగీరథ పనులు జరగలేదని చెప్పడం సరికాదని, తమ గ్రామంలోనే ఇంటింటికీ ఏర్పాటు చేసిన నల్లాలను చూపిస్తామని చెప్పారు. గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటి ముందు ఏర్పాటు చేసిన నల్లాలను చూడాలని ఎమ్మెల్యేను కోరగా, తాను మరో రోజు వచ్చి నల్లాలతో పాటు అన్ని అభివృద్ధి పనులను పరిశీలిస్తానని దాటవేశారు. గ్రామసభలో ప్రజలకు ఇచ్చిన హామీల ఊసెత్తని ఎమ్మెల్యే, ఆసాంతం రాజకీయ ప్రసంగమే చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి దత్తత గ్రామం తుర్కపల్లిలో అధికారులకు, కాంగ్రెస్ నేతలకు చుక్కెదురైంది. శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో నిర్వహించిన గ్రామసభలో బీఆర్ఎస్ నేత, మాజీ ఉప సర్పంచ్ యూసఫ్బాబా ప్ర శ్నలవర్షం కురిపించాడు. ఇంటి నిర్మాణం కోసం స్వస్థలం ఉన్నవారిని 77 మందిని ఎంపిక చేసినట్టు అధికారులు చెప్పారు. 77 మందిలో కచ్చితంగా ఎంతమందికి ఇండ్లు వస్తాయని యూసఫ్ నిలదీశాడు. ఒక్క ఏడాదిలోనే అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు తొసిపుచ్చే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నేతలు ఎక్కడా తగ్గలేదు. అధికారులు మాట్లాడుతూ దశల వారీగా కేటాయిస్తామని చెప్పడంతో కొంతమంది కొత్త దరఖాస్తుదారులు ఎంపిక చేసినవారికే మొదటి, రెండు, మూడో విడతలు అంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటున్న తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు.
అనర్హులతో తయారు చేసిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను రద్దు చేయాలని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో గురువారం రాస్తారోకో చేశారు. దరఖాస్తు ఓ చోట.. ఇల్లు ఒకచోట జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన దేవరాయి కుమారస్వామి భార్య భాగ్యకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఇప్పగూడెంలో జరిగిన సభ నుంచి ఓ అధికారి ఫోన్‌చేసి చెప్పాడు. తాము స్టేషన్ ఘన్‌పూర్‌లో దరఖాస్తు చేసుకుంటే ఇప్పగూడంలో రావడమేమిటని కుమారస్వామి విస్తుపోయాడు. వెంటనే అధికారుల వద్దకు వెళ్లగా తప్పుగా పడింద చెప్పి పేరు తొలగించి ఇప్పగూడేనికి చెందిన మరో మహిళకు కేటాయించారు. తన పేరు ఎలా తొలగిస్తారని, స్టేషన్ ఘన్‌పూర్‌కు మార్చాలని డిమాండ్ చేశాడు.
80 వేల మందికి పైగా జనాభా ఉన్న భద్రాచలం సభను పంచాయతీలో ఏర్పాటుచేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో స్థలం సరిపోక అధికారులు జీపీ కార్యాలయ గేటుకు తాళం వేశారు. దీంతో మిగిలిన ప్రజలు గంటల తరబడి ఎండలో గేటుబయటే ఉండిపోయారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వచ్చిన సమయంలో ఆయనను లోనికి తీసుకెళ్లి మళ్లీ తాళం వేశారు. ఐటీడీఏ పీవో రాహుల్ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. ఆర్డీవో స్థాయి అధికారి తండ్రికి రేషన్ కార్డు మంజూరు చేసి నిరుపేదలకు ఎందుకు ఇవ్వడం లేదంటూ కేఎంసీ 53వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య అధికారులను ప్రశ్నించారు. తన పేరు ఇండ్ల జాబితాలో లేదని చెప్పడంతో బోనకల్లు సభలో మందపల్లి సుజాత కన్నీరుమున్నీరుగా విలపించింది. అశ్వారావుపేటలోప్రజలు ఒక్కసారిగా నిలదీయడంతో కార్యదర్శి మహేశ్వరి కంటతడి పెట్టుకున్నారు. ములకలపల్లిలో సభ ను బహిష్కరించి ధర్నా చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం దొడ్డిపల్లిలో జాబితాను చదువుతుండగా అనర్హుల పేర్లు ఎలా ఎక్కించారని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్(మేట్) చంద్రయ్యపై గ్రామానికి చెందిన కొందరు దాడి చేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు.
నిజామాబాద్ జిల్లా బడా భీమ్‌గల్‌లో బుధవారం గ్రామసభ ముగిసినా గురువారం మరోసారి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటూ సర్వే చేశారు. ముప్కాల్‌లో గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక గ్రామసభను అధికారులు అర్ధాంతరంగా ముగించి జారుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్వగ్రామం జలాల్పూర్ సభలో అధికారులను ప్రజలు నిలదీశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్పల్లిలో పాల బిల్లులపై ఎమ్మెల్యే కశిరెడ్డిని పాడి రైతులు ప్రశ్నించారు. నాలుగు నెలలుగా బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం జూలపల్లిలో మాజీ ఉప సర్పంచ్ పోలుదాసరి సాయికుమార్ తమ గ్రామంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఎంపీడీవోతో పాటు పలువురు అధికారుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. అధికారులను ప్రజలు సమావేశం నుంచి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసుల బందోబస్తు మధ్య వారిని గ్రామసభ నుంచి పంపించారు.
‘మా ఓట్లు కావాలె గాని, మాకు ఇల్లు ఇవ్వరా?’ ఇల్లు ముంగిలి లేనిదాన్ని. అద్దెకొంపల ఉంటున్న. నాకో బిడ్డ ఉన్నది. మేం యాడ ఉండాల?’ అని సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామసభలో ఓ దివ్యాంగురాలు అధికారులను నిలదీసింది. ‘ఈ ప్రభుత్వానికి మా వికలాంగుల ఉసురు తగులుతది’ అంటూ కన్నీటిపర్యంతమైంది.