బషీరాబాద్, మే 10: కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తారా? అంటూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యమా? ఇంటి దొంగల రాజ్యమా? అని మండిపడ్డారు. శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వేలో భాగంగా ఏపీవో పద్మారావు, పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్ గ్రామంలో ఆరా తీస్తుండగా ఇండ్లు ఉన్న వారిని లబ్ధిదారులుగా ఎలా గుర్తిస్తారని స్థానికులు నిలదీశారు. గ్రామానికి చెందిన బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి కనుసన్నల్లో ఎంపిక ప్రక్రియ జరిగిందంటూ ఆరోపించారు.
తమకు అర్హత లేదా? అని స్థానికులు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. కిరాయి ఇండ్లలో ఉంటూ కష్టాలు పడుతున్న తాము కన్పించడం లేదా? అని నిలదీశారు. దీంతో అధికారులు సర్వే ప్రక్రియను నిలిపివేసి వెళ్లిపోయారు.