Indiramma Indlu | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం సోమవారం ప్రారంభంకానున్నది. సీఎం రేవంత్రెడ్డి భద్రాచలం వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మణుగూరులో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందజేస్తుంది. సొంత జాగ లేనివారికి ఇంటిస్థలంతోపాటు నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేస్తారు.
ఏటా 4.50 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున 4,16,500 ఇండ్లు మంజూరు చేసింది. మిగతా 33,500 ఇండ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంచింది. ఈ పథకం అమలుకు హడో నుంచి రూ.3 వేల కోట్ల నిధులను సమీకరించింది. వీటి ద్వారా 95 వేల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో గ్రామాల్లో 57 వేల ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లో 38 వేల ను నిర్మించనున్నది. వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది.