Indiramma Illu | తొర్రూరు, మే 8 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండా వాసులు అధికారులపై మండిపడ్డారు. విచారణ నిమిత్తం గురువారం తండాకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, తండా కార్యదర్శి గుగులోత్ రాజును గ్రామస్థులు నిలదీశారు. సోమారపుకుంట తండాకు మంజూరైన 10 ఇందిరమ్మ ఇండ్లను 5 నుంచి 7 ఎకరాల భూమి కలిగిన కాంగ్రెస్ నేతలకే కేటాయించారని, నిజంగా ఇండ్లు లేని పేద గిరిజనులకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా నాయకుడి కింద పనిచేసే వర్గానికి కూడా ఇండ్లు కేటాయించారని గిరిజనులు ఆరోపించారు. ‘ఇందిరమ్మ కమి టీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సభ్యులెవరు? ఎంపిక ఏ ఆధారంగా చేశారో చెప్పండి’ అంటూ తండావాసులు అధికారులను నిలదీశారు. వారికి సమాధానం ఇవ్వలేక డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, కార్యదర్శి గుగులోత్ రాజు అకడి నుంచి వెళ్లిపోయారు.