హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో కూడిన ‘క్యూర్’ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. మురికివాడల్లో ఇందిరమ్మ మాడల్ కాలనీలు, ఇండ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడం, నిర్మాణం పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడం తదితర అంశాలపై మంగళవారం ఆయన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్చార్జి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి సచివాలయంలో సమీక్షించారు.
నిరుపేదల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూసేందుకు స్ధానిక పరిస్ధితులను బట్టి వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని ఆలోచిస్తున్నామని, దీనిపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. మురికివాడల్లో స్థలాలు ఉన్నవారు అంగీకరిస్తే ఆ ప్రాంతంలో జీప్లస్ 5 మాడల్‌లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి, అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో స్థలాలున్న 28 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. మధ్య తరగతి ప్రజల కోసం గతంలో కేపీహెచ్బీలో నిర్మించిన మాదిరిగా ట్రిపుల్ఆర్-ఓఆర్ఆర్ పరిధిలో ఇండ్లు నిర్మిస్తామని పేర్కొంటూ.. ఇందుకు 4 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.