Indiramma Indlu | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులే కేటాయించింది. ఈ ఏడాది రూ.4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఏ మూలకూ సరిపోయేలా లేవు. రూ. 22.5వేల కోట్ల కన్నా అధికంగా నిధులు అవసరం కాగా, రూ.9,184 కోట్లే కేటాయించారు. అందులోనూ కేంద్రం ద్వారా వచ్చే నిధులే ఎక్కువ. గత ఏడాది కేసీఆర్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ.13,428 కోట్లు కేటాయించగా, ఈసారి ప్రభుత్వం రూ.9,184 కోట్లతోనే సరిపుచ్చింది. ఈ పథకం కింద ఎస్సీ,ఎస్టీలకు రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లు నిర్మించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలన్నది లక్ష్యం కాగా, ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నర లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసినా రూ.22, 500 కోట్లు అవసరమవుతాయి. తాజాగా ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించటంతో దీనికి మరిన్ని నిధులు అవసరం అవుతాయి. పీఎం ఆవాస్ యోజన (అర్బన్), పీఎం ఆవాస్ యోజన (రూరల్) పథకం కింద రూ.7117.55 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని, దీనికితోడు హౌసింగ్‌బోర్డు, హౌసింగ్ కార్పొరేషన్లకు హడ్కో ద్వారా రూ.1,150 కోట్లు రుణం ద్వారా సమీకరించనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్లో వెల్లడించింది.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు నామమాత్రమే. దీన్నిబట్టి పేదల గృహ నిర్మాణంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లలో అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా పూర్తిచేసి పేదలకు కేటాయిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు. అయితే, ప్రభుత్వం చెప్తున్న ఈ నాలుగున్నర లక్షల ఇండ్లలో ఆ డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా ఉంటాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్సీసీ కప్పుతో ఒక వంటగది, ఒక టాయిలెట్ తప్పనిసరి. పట్టణ ప్రాంతాల్లో స్థలం లభ్యతను బట్టి గ్రూప్ హౌసింగ్, అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థలం ఉన్నవారు తమ సొంత స్థలంలో ఇండ్లను నిర్మించుకొనే వెసులుబాటు ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కేంద్రం నుంచి గరిష్ఠంగా రాష్ర్టానికి రెండు లక్షల ఇండ్లే మంజూరయ్యే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు, కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలు మాత్రమే ఇస్తుంది. పైగా, లబ్ధిదారుల ఎంపిక కూడా కేంద్ర నిబంధనల ప్రకారమే, కేంద్ర ప్రభుత్వ యాప్‌లోనే చేయాల్సి ఉంటుంది. కేంద్రం రాష్ర్టాన్ని యూనిట్‌గా తీసుకొని ఇండ్లను మంజూరు చేస్తుంది. రాష్ట్ర జోక్యం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కో నియోజకవర్గంలో మూడున్నర వేల ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించింది. కేంద్ర నిధులను ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు నియోజకవర్గాలవారీగా ఇండ్లను మంజూరుచేసే అవకాశం లేదు.
