హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో (IndiGo) సంక్షోభం కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలు క్యాన్సల్ అయ్యాయి. విమానాలు ఎప్పుడు నడుస్తాయో సరైన సమాచారం లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఇక విశాఖపట్నం విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 9 విమానాలు రద్దయ్యాయి. ఇందులో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఉన్నాయి. కాగా, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరో 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా శనివారం 400కు పైగా ఇండిగో విమాన సర్వీసులు క్యాన్సల్ అయినట్లు సంస్థ వెల్లడించింది. ముంబైలో 109, ఢిల్లీలో 106, బెంగళూరులో 120, పుణెలో 42, చెన్నైలో 29, లక్నోలో 7, తిరువనంతపురంలో 6, అహ్మదాబాద్‌లో 19 చొప్పున విమానాలు రద్దయ్యాయి.