హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): దేశాన్ని క్రాప్ కాలనీలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొచ్చినప్పుడే రైతులకు లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో దేశంలోనే అతిపెద్ద ‘కిసాన్’ అగ్రి షోను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను పరిశీలించారు. దేశంలోనే మొట్టమొదటిసారి కేస్ సంస్థ తయారు చేసిన చెరుకు కోత మిషన్, సీఎన్‌హెచ్ కంపెనీ తయారుచేసిన 30 హెచ్‌పీ సింబా ట్రాక్టర్, 5602 ట్రాక్టర్‌ను ప్రారంభించారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఇంత భారీస్థాయిలో అగ్రి ఎక్స్పో జరుగడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు.
వ్యవసాయంలో వివిధ రకాల యంత్రాలు, వినూత్న ఆవిషరణలను ఇకడ ప్రదర్శించారని చెప్పా రు. వీటన్నింటినీ చూస్తుంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కచ్చితంగా వ్యవసాయ పరిశ్రమల్లో ఒక మార్పు తీసుకువస్తుందనే ఆశాభావం కలుగుతున్నదని చెప్పారు. ఈ ప్రదర్శన వినూత్న ఆవిషర్తలతోపాటు రైతులకు కూడా ఎంతో ఉపయోగపడాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. రైతులు విత్తనం వేసినప్పటినుంచీ పంటను ప్రాసెస్ చేసే వరకు వ్యవసాయ యాంత్రీకరణను అనుసరిస్తే రాష్ట్ర వ్యవసాయరంగ స్వరూపమే మారిపోతుందని పేర్కొన్నారు.
యాంత్రీకరణ వల్ల కూలీల కొరత తీరుతుందని, పంట సాగు ఖర్చు, వృథా తగ్గి.. దిగుబడులు పెరుగుతాయని వివరించారు. హైదరాబాద్‌లో ఈ తరహా భారీ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని కిసాన్ ఫోరం ప్రైవేట్ లిమిటెడ్ కన్వీనర్ నిరంజన్ దేశ్‌పాండే పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి నిరంజన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిబిటర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన సాంకేతిక పరికరాల ప్రదర్శనకు హైదరాబాద్ వేదికైంది. హైటెక్స్‌లో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘కిసాన్’ ప్రదర్శనలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్, రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీల క్లస్టర్ జ్ఞాన కేంద్రం, పలు ప్రధాన పరిశ్రమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 160కి పైగా కంపెనీల అనుసంధానంతో 150కి పైగా ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. 20కిపైగా అగ్రిస్టార్టప్స్ నూతన సాంకేతికతలు, భావాలను ఇకడ ప్రదర్శించాయి. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో చెరుకు కోత మిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకొన్నది.
‘కిసాన్’ అగ్రి షోలో ప్రదర్శించిన 30 హెచ్‌పీ సింబా ట్రాక్టర్ చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో అన్ని పంటల్లో అంతర సాగు చేసుకొనేందుకు వీలుంటుంది. తీగ జాతి తోటలు, పండ్ల తోటలు, కూరగాయల సాగుకు అనుకూలం.
– ఎం అనిల్‌కుమార్‌రెడ్డి, ఆదర్శరైతు
హైదరాబాద్‌లో ఇంత పెద్దఎత్తున ‘కిసాన్’ అగ్రి షో జరుగడం ఇదే మొదటిసారి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపయోగించే యంత్రాలు ఒకేచోట చూసే అవకాశం దక్కింది. అధునాతన సాంకేతిక పరికరాలు ఆకట్టుకొన్నాయి.
– మర్ల చంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్