రఘునాథపాలెం, నవంబర్ 30 : ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన కొడుకు దుండగుల కాల్పుల్లో దుర్మరణం చెందాడన్న వార్త ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. ఆ రోజు రాత్రే వీడియో కాల్ మాట్లాడిన కొడుకు తెల్లవారేసరికే కానరాని లోకాలకు చేరాడని ఫోన్‌కాల్ విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరం రామన్నపేట ప్రాంతానికి చెందిన నూకారపు కోటేశ్వరరావు-వాణి దంపతులకు కుమార్తె, కుమారుడు సాయితేజ (22) ఉన్నారు. సాయితేజ జూన్ 15న ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని చికాగో రాష్ట్రం కాంకోడియా యూనివర్సిటీకి వెళ్లాడు. అక్కడే ఓ షాపింగ్‌మాల్‌లో కౌంటర్ మేనేజర్‌గా పార్ట్‌టైమ్ జాబ్‌లో చేరాడు.
శుక్రవారం పార్ట్ టైమ్‌జాబ్ చేస్తున్న క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు షాపింగ్‌మాల్‌లోకి వచ్చి డబ్బుల కోసం సాయితేజను డిమాండ్ చేశారు. కౌంటర్ నుంచి డబ్బులు ఇచ్చినప్పటికీ సాయితేజను దుండగులు గన్‌తో కాల్పులు జరిపి వెళ్లిపోయారు. కాల్పుల్లో సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉంటున్న సాయితేజ బంధువులు విషయాన్ని ఖమ్మంలోని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు.
సాయితేజ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. స్వస్థలం రామన్నపేటకు పెద్దఎత్తున బంధువులు తరలివచ్చి సాయితేజ తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. సాయితేజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరామర్శించారు. సాయితేజ మృతదేహాన్ని ఖమ్మానికి తీసుకొని వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తానా ప్రతినిధులను ఎమ్మెల్సీ కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సాయితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.