హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ ): తెలుగు రాష్ర్టాల ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. గత ఏడాది అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు.. ఈ ఏడాది ఆశాజనకంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ముందస్తు రుతుపవన వర్షాలు (ప్రీ మాన్సూన్ రెయిన్స్) ప్రారంభమయ్యాయి. దక్షిణ విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద ఉపరితల ద్రోణి తాకనుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మే 31న కేరళకు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాతే.. తెలుగు రాష్ర్టాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద పేర్కొన్నారు. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.