హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ఆరుదశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేరడాన్ని బీజేపీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నది. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నేతలు తెలంగాణను అవమానిస్తూ వచ్చారు. అంతేకాదు, తెలంగాణకు నిధులు ఇవ్వడంలోనూ కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నది. రాష్ట్ర ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నది. వివిధ సందర్భాల్లో తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇప్పుడేమో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దేశ చిత్రపటంలో తెలంగాణనే లే కుండా చేశారు. దేశ సాంస్కృతిక వైభవం పేరుతో రూ పొందించిన చిత్రపటంలో ఏపీలోనే తెలంగాణ ఉన్న ట్టు చూపించారు. దానిని ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు బహూకరించారు. అఖండ భారతావనిని చూపించిన ఈ మ్యాప్‌లో ఎక్కడా తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలు కానీ, భౌగోళిక గుర్తింపు కానీ లేదు. దీనిని మీడియాకు విడుదల చేయడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
తెలంగాణలేని భారతదేశ చిత్రపటాన్ని లోకేశ్‌కు మాధవ్ బహూకరిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయినప్పటికీ తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే దీనిపై గట్టిగా మాట్లాడింది.
తెలంగాణ ఏర్పాటును బీజేపీ మొదటి నుంచీ వ్యతిరేకించింది. 1999లో కాకినాడ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని, ఒక ఓటు.. రెండు రాష్ట్రాలని బీజేపీ చెప్పిం ది. ఆ తర్వాత ఆ నినాదాన్ని పక్కన పెట్టింది. బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ హైదరాబాద్ ఉన్న ప్రాంతానికి విభజన అవసరం లేదని, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం ఎందుకని మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంచేసి రాష్ర్టాన్ని సాధించుకున్నాక బీజేపీ తన అసలు రంగును బయటపెట్టుకున్నది. 2014 పార్లమెంటు ఎన్నికల నుంచే మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు రాష్ట్ర నేతలూ అదేబాటలో పయనిస్తున్నారు.
భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై బీజేపీ నేతలు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని లెక్కచేయకపోవడం బీజేపీ అధికారిక విధానమా? అని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఈ విషయంలో మోదీకి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. ‘దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైనచోటు దకడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ. మీ పార్టీ ఏపీ అధ్యక్షుడు మా సంస్కృతికి గుర్తింపును, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే చూపించడం దారుణం. తెలంగాణ అస్తిత్వాన్ని లెకచేయని చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. దేశ చిత్రపటం నుంచి మా చరిత్రను తొలగిస్తే మేమెవరం? ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా? లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేయడం. పొరపాటైతే, తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ బహూకరించిన తెలంగాణ లేని దేశ చిత్రపటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసుజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. ఆ మ్యాప్‌లో ఉద్దేశపూర్వకంగానే తెలంగాణను విస్మరించారని గురువారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. పటంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, దశాబ్దాల పోరాటం తర్వాత 28వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను ఉద్దేశపూర్వకంగానే విస్మరించినట్టు తెలుస్తున్నదని, ఇది ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ప్రజలు, ఉద్యమకారులను కించపర్చడమేనని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటై 11 ఏండ్లు అవుతున్నా తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ, టీడీపీ నేటికీ కుట్రలు, దాడులు చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ వారసత్వం, గుర్తింపును చెరిపివేయడంలో భాగంగా ఈ హేయమైన చర్యకు నేతలు ఒడిగట్టారని మండిపడ్డారు. ఓ వైపు గోదావరి, కృష్ణా నీళ్లను దోచుకోవడం, మరోవైపు భారతదేశ చిత్ర పటం నుంచి తెలంగాణ పేరును విస్మరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు? ఇది తమ పోరాటం, త్యాగాలు, చరిత్రను విస్మరించడం అని గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ లేని మ్యాప్‌ను బహిరంగంగా చూపినందుకు సెక్షన్ 336, 337 కింద సుమోటోగా డీజీపీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపై స్పందించాలని, టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు.
2014 ఏప్రిల్ 30 తిరుపతి సభలో తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు.
2014 ఫిబ్రవరి 28, కర్ణాటకలోని గుల్బర్గాలో తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించి సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనాథగా మార్చింది.
2018 ఫిబ్రవరి 7న పార్లమెంటులో ఎన్నికల్లో లబ్ధికోసం పార్లమెంటు తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. రాజకీయ స్వార్థంతో హడావుడిగా ఏపీ విభజన నిర్ణయం తీసుకున్నారు.
ఇలా ఒకటి, రెండుసార్లు కాదు.. అవకాశం చిక్కిన ప్రతిసారీ, ప్రతి సందర్భంలోనూ మోదీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్లమెంటులోనూ, ప్రచార సభల్లోనూ తెలంగాణపై అక్కసు ప్రదర్శించారు.