హనుమకొండ, మే 6: అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే చెరుకు పరిశ్రమను మూసేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు స్వాంతంత్య్రం సాధించిన నాయకుడు కేసీఆరే అని.. కాంగ్రెస్ కళ్లబొల్లి మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు.
శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై మంత్రి హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు రైతుబంధు, రైతుబీమా అమలు చేయలేదని అడిగారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే అక్కడి రైతులు తెలంగాణలో అమ్ముకొంటున్నారన్నారు. పసుపు బోర్డు కోసం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడితే కనీస మద్దతు తెలుపని కాంగ్రెస్ ఇప్పుడు బోర్డు తెస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పాలనలోనే పోడుభూముల సమస్య ఉత్పన్నమైందని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందించిన ఘనత టీఆర్ఎస్దేనని ఉద్ఘాటించారు.
మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా ఎవ్వరూ మీతో పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధంగా లేరని మంత్రి అన్నారు. ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని చెప్పారు. మీరు దేశానికి, తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టంచేశారు. తెలంగాణ ఊరికే ఇవ్వలేదని.. కొట్లాడి తెచ్చుకున్నామని పునరుద్ఘాటించారు. దేశంలో రైతుల కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. రాహుల్‌గాంధీ సమర్థుడు అయితే తాను ఎంపీగా పోటీచేసిన నియోజకవర్గంలో ఎందుకు ఒక్క ఎమ్మెల్యే గెలువలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ వరంగల్ సభ అట్టర్‌ప్లాప్ అయ్యిందన్న మంత్రి.. టీఆర్ఎస్ కార్యకర్తల స్థాయిలో కూడా ఆ సభ లేదన్నారు.
రేవంత్ రెడ్డి మాటలు ఎవరూ నమ్మరని, ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదన్నారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని స్వయంగా రాహుల్‌గాంధీ ఒప్పుకొన్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ప్రజలు నిలదీస్తారనే భయంతోనే రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించలేదని విమర్శించారు. కాంగ్రెస్ తమకు పోటీనే కాదని, ఆ పార్టీ రాష్ట్రంలో ఏనాడో చచ్చుపడిందని మంత్రి పేర్కొన్నారు. 70 ఏండ్ల పాటు రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎర్రబెల్లి స్పష్టంచేశారు.