హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1న ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్, డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి సీఎస్ వజ్రోత్సవ ముగిం పు ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. హెచ్ఐసీసీలో జరిగే ముగింపు ఉత్సవానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల అధ్యక్షులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. గంటసేపు దేశ భక్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించే పలు సాంసృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. అనంతరం సీఎం సందేశం ఉంటుందని చెప్పారు. వజ్రోత్సవ ముగింపు వేడుకలకు పటిష్ట నిఘా, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పునరుద్ధరణ పనులపై సీఎస్ సమీక్ష
గత నెలలో కురిసిన భారీవర్షాల కారణంగా జరిగిన వివిధశాఖల పనులకు జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులపై సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, కూలిపోయిన ఇండ్ల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించిందని సీఎస్ వెల్లడించారు.