Independence Day | తెలంగాణవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఇక శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.
ఇక వివిధ జిల్లాల్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు, ఖిలావరంగల్ కోటలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో కొండా సురేఖ, ములుగులో సీతక్క, సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్ జాతీయ జెండా ఎగుర వేశారు. మిగతా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎస్పీలు జెండాలను ఎగురవేశారు.
తెలంగాణ భవన్‌లోనూ స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్న ఆయన.. వారికి ఘన నివాళులర్పించారు.