Telangana | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అపసవ్య దిశలో సాగుతున్నది. రేవంత్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఆదాయం సమకూర్చుకోవడంలో చేతులెత్తేస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి, బడ్జెట్ అంచనాలను దాటి అందినకాడికి రుణ సమీకరణ చేస్తున్నది. పాలకుల అడ్డగోలు నిర్ణయాలు, ఏడాదికాలంలోనే రికార్డుస్థాయిలో పెరుగుతున్న అప్పులు, ఆర్థిక నిర్వహణ లోపాలపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.56,026 కోట్ల రుణాలు సేకరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ నుంచి చివరి త్రైమాసికంలో రూ.30,000 కోట్లు తీసుకోవాలని ఇండెంట్ పెట్టింది. జనవరి నుంచి మార్చి వరకు ప్రతి మంగళవారం వేలంలో పాల్గొని నెలకు రూ.10,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణపర్వం రాష్ట్ర బడ్జెట్ అంచనాలను తారుమారు చేయడంతోపాటు ఉమ్మడి పాలకులు తెలంగాణపై మోపిన రుణభారాన్నీ మించిపోతున్నది. ఈ విధమైన మారెట్ రుణాలపై అధికంగా ఆధారపడటం ప్రభుత్వం ముందుచూపులేమి, పాలన లోపాలను ఎత్తిచూపుతున్నది.
రేవంత్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణ వివరాలను వెల్లడించింది. అప్పు పద్దు కింద రూ.62 వేల కోట్లు చూపించింది. ఈ ఏడాది రూ.62,012 కోట్లు రుణ సమీకరణ చేయనున్నట్టు బడ్జెట్లో ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1000 కోట్లు సమీకరించనున్నట్టు పేర్కొన్నారు. కానీ, డిసెంబర్ 31 నాటికే ఒక్క ఆర్బీఐ నుంచే రూ.56,026 కోట్లు సేకరించారు. వచ్చే మూడు నెలల్లో నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున మరో రూ.30 వేల కోట్ల రుణ సమీకరణకు ముందస్తు చర్యలు చేపట్టారు. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకు అదనంగా రూ.8,897 కోట్లు అప్పు తెస్తున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకకు ఇచ్చిన రుణపరిమితి (ఎఫ్ఆర్బీఎం) రూ.49,255 కోట్లు మాత్రమే. కానీ, ఆర్బీఐ నుంచి మూడు త్రైమాసికాల్లో ఇప్పటికే తీసుకున్న రుణం రూ.40,909 కోట్లకు చేరింది. చివరి త్రైమాసికంలో ఆర్బీఐ నుంచి రూ.30 వేల కోట్ల రుణం పొందేందుకు బాండ్స్‌ను సిద్ధం చేసింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం పరిధి కింద మొత్తం రుణం రూ.70,909 కోట్లకు చేరుతున్నది. అంటే అంచనాకు మించి అదనంగా రూ.21,654 కోట్లు రేవంత్‌రెడ్డి సర్కారు చేస్తున్నది.
ఆఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ఆయా రాష్ర్టాల జీఎప్డీపీలో 3.5 శాతం వరకు రుణం తీసుకోవడానికి అనుమతి ఉన్నది. 2024-25కు తెలంగాణ జీఎస్డీసీ సుమారు 16 లక్షల కోట్లుగా అంచనా వేశారు. దీని ప్రకారం రుణ పరిమితి రూ.57,112 కోట్లు. కానీ, కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 సమయంలో ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అనుసరించి ఈ పరిమితిని రూ.49,255 కోట్లకు తగ్గించింది.
బడ్జెట్ అంచనాలను దాటి, ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి రేవంత్ సర్కారు ప్రజలపై అప్పుల భారం మోపడంపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెడ్లుగా సాగాయి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో, ఆర్థిక అంశాలపై అవగాహన లేమితనంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది’ అని బీఆర్ఎస్ నేత ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అదనపు రుణాలకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందా? లేదా అనే విషయంపై రాష్ట్ర ఆర్థికశాఖ స్పష్టత ఇవ్వలేదు.