Free Bus | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నాకొద్దీ పల్లెలకు ప్రజారవాణా దూరమవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడమే లేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 2,500 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యంలేదు. మహాలక్ష్మి పథకం ఆరంభమై 14 నెలలు అవుతుండగా, దీనిని వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల మహిళలకు మాత్రం పల్లెవెలుగు బస్సు సర్వీసులు అందుబాటులోకి రావడం లేదు. దీంతో బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంటున్నది. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా పల్లె వెలుగు సర్వీసులను పెంచడంపై సర్కారు దృష్టి సారించడమే లేదు. ఉచిత ప్రయాణం అందించేందుకు వీలుగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్యను పెంచకుండా సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను పెంచడంతో సర్వ త్రా విమర్శలు ఎదురవుతున్నాయి. మరోవైపు మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు అందుబాటులో ఉన్న పల్లెవెలుగు బస్సుల సంఖ్య తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పల్లెవెలుగు బస్సు సర్వీసుల తగ్గింపుపై మహిళా వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
పెరిగిన ప్రయాణికులు.. తగ్గిన బస్సులు
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 115 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కండక్టర్లు వారికి రూ.3,902.30 కోట్ల విలువైన జీరో టిక్కెట్లను జారీచేశారు. ఉచిత టిక్కెట్ల కోసం సర్కార్ ప్రతి నెలా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆర్టీసీ యా జమాన్యానికి చెల్లిస్తున్నది. తద్వారా ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొస్తున్నామని సర్కార్ చెప్తున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పథకాన్ని వినియోగించుకునే మహిళల కోసం పల్లెవెలుగు బస్సులు అంతగా లేవు. 2024 మార్చి వరకు 3,339 పల్లెవెలుగు బస్సులు ఉండగా, ఇదే ఏడాది జూలై నాటికి వాటి సంఖ్య 3,292కి, అక్టోబర్ నాటికి 3,224కు తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా 586 సూపర్ లగ్జరీ, 239 డీలక్స్ బస్సులు మాత్రమే ఉండేవి. 2024లో సూపర్ లగ్జరీ 693, డీలక్స్ బస్సుల సంఖ్య 306కు పెరిగింది. మహాలక్ష్మి అమలుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 45 లక్షల మంది నిత్యం ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ప్రయాణించగా, మహాలక్ష్మి పథకం తర్వాత ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది. రోజుకు 36 నుంచి 40 లక్షల మంది వరకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
కొత్త బస్సులు ఎందుకు కొనరు?
రాష్ట్రవ్యాప్తంగా 2,500 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సులు వెళ్లడమే లేదు. పల్లెవెలుగు బస్సుల సంఖ్య తగ్గిపోతున్నది. కొత్త బస్సుల పేరుతో యాజమాన్యం లగ్జరీ, డీలక్స్ బస్సులను కొనుగోలు చేస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాల పేరిట ప్రైవేటు లగ్జరీ బస్సులే అందుబాటులోకి వస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే మున్ముందు ఉచిత బస్సులు ఉండే పరిస్థితి కనిపించడమే లేదు.
– ఎం థామస్‌రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి
బడ్జెట్లో రోడ్ల కేటాయింపుల వివరాలు..