Fish Consumption | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది. భారతదేశంలో సాధారణంగా చేపల వినియోగాన్ని ప్యాటర్న్, ట్రేండ్ను బేస్ చేసుకుని అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, భారత ప్రభుత్వం అండ్ వరల్డ్ ఫిష్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. 2005 నుంచి 2024 వరకు చేపల వినియోగం ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేయగా, దేశంలో గణనీయమైన వృద్ధి కనిపించినట్టు అధ్యయనం తెలిపింది. ఇందుకు జనాభా పెరుగుదల, పెరిగిన సంపద, మారుతున్న పరిస్థితులు కారణంగా పేర్కొన్నది.
966.9 మిలియన్ల వినియోగం..
భారతదేశంలో చేపలు తినే జనాభా 73.6 మిలియన్ల నుంచి 966.9 మిలియన్లకు(71.1శాతం)చేరింది. ఇది సుమారు 32 శాతం పెరుగుదలను సూచిస్తున్నది. తూర్పు ఈశాన్య రాష్ర్టాలు, తమిళనాడు, కేరళ, గోవాలో అత్యధికంగా చేపలు తినేవారి సంఖ్య (90 శాతం కంటే ఎక్కువ)ఉన్నది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ర్టాలు అత్యల్పంగా(30 శాతం కంటే తక్కువ) ఉన్నాయి. జమ్ముకశ్మీర్లో చేపలు తినేవారి సంఖ్య అత్యధికంగా పెరగడం గమనార్హం. కేరళ, గోవాలోనూ రోజువారీ చేపల వినియోగ శాతం అత్యధికంగా ఉన్నట్టు అధ్యయనం వెల్లడించింది. తెలంగాణలో చేపలు తినేవారు మొత్తం జనాభాలో 58 శాతం మాత్రమే ఉన్నట్లు స్పష్టంచేసింది. రాష్ట్ర జనాభాలో చాలామందికి చేపలు తినాలనే కోరిక ఉన్నప్పటికీ.. వాటిలోని ముల్లుల భయంతో చేపలు తినడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది.
దేశంలో చేపల వినియోగం ఇలా..
చేపలు తినేవారు : 71.1%