హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతున్నది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో 10 రోజులుగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆయా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, 20 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా, మరో 6 జిల్లాల్లో 19 డిగ్రీల కంటే తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.9 డిగ్రీలు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ (టీ) 8.2 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేట 8.9, నిజామాబాద్ జిల్లా కోటగిరి 9.7 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 9.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మార్పల్లెలో 10 డిగ్రీలు నమోదైంది.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్నదని, గంటకు 8 కి.మీ వేగంతో కదులుతున్నదని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 270కి.మీ, నాగపట్నానికి 300, పుదుచ్చేరికి 340, చెన్నైకి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని తుఫాన్‌గా బలపడే అవకాశం ఉన్నదని వివరించారు. శనివారం మధ్యాహ్నం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అకడకడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.