హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): వివిధ దేశాలు, రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో ఇప్పటికే మొదటి డోసు లక్ష్యం దాదాపుగా వంద శాతానికి చేరువైందని, ఇదే స్ఫూర్తితో రెండో డోసు కూడా వందశాతం పూర్తి చేసేలా కృషి చేయాలని అన్నారు. ఎంసీఆర్‌హెచ్చార్డీలో సోమవారం మంత్రి హరీశ్‌రావు కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో మొదటి డోసు సగటు 90 శాతం ఉంటే, తెలంగాణలో 99.46 శాతం ఉన్నదని, రెండో డోసు జాతీయ సగటు 61శాతం కంటే 4 శాతం ఎక్కువ 65 శాతం ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో 15-18 ఏండ్ల వయసున్నవారు 22.78 లక్షలు, 60 ఏండ్లు పైబడినవారు 41.60 లక్షలు, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వారియన్లు 6.34 లక్షలు ఉన్నారని, వీరందరికీ 70 లక్షల వ్యాక్సిన్లు అవసరం అవుతాయని మంత్రి చెప్పారు. జనవరి 3 నుంచి వీరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించుకోవాలని సూచించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్‌రావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణ సాకారం చేద్దాం
ముఖ్యమంత్రి కేసీఆర్ కల ఆరోగ్య తెలంగాణను సాకారం చేసేందుకు అందరం కలిసి కృషి చేద్దామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆయుష్ ఫార్మసిస్ట్ సెంట్రల్ ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను కోకాపేటలోని తన నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ఫోరం అధ్యక్షుడు ప్రకాశ్‌రావు, జనరల్ సెక్రటరీలు జయప్రకాశ్‌రెడ్డి, సుధారాణి, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మోహన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
12 ఒమిక్రాన్ కేసులు
రాష్ట్రంలో సోమవారం 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో 10 మంది రిస్క్కాని దేశాల నుంచి వచ్చినవారు కాగా.. మరో ఇద్దరు గతంలో పాజిటివ్ వచ్చినవారి కాంటాక్ట్‌లని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 56కు పెరిగింది. సోమవారం రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి 263 మంది ప్రయాణికులు రాగా.. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 24 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 182 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. 181 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో పాటు ఇతర కారణాలతో ఒకరు మృతిచెందారు.
మొదటి డోస్.. వందశాతం!
రాష్ట్రంలో కొవిడ్ టీకా మొదటి డోస్ దాదాపు 100 శాతం పూర్తయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 2,77,67,000 మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించగా.. సోమవారం నాటికి 2,76,79,961 డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించింది. మరో 87,039 మందికి టీకాలు వేయాల్సి ఉన్నదని పేర్కొన్నది.