హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి గౌరవ వేతనాన్ని భారత ఎన్నికల సంఘం పెంచింది. దీనితోపాటు ఆహారం ధరలను కూడా సవరించింది. ప్రిసైడింగ్ అధికారి, లెకింపు సూపర్వైజర్కు 2014లో రోజుకు రూ.350 ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ.500కు పెంచింది. పోలింగ్ అధికారికి నాడు రోజుకు రూ.250 ఇవ్వగా.. ఇప్పుడు రూ.400 చేసింది. ఓట్ల లెకింపు సహాయకుడికి నాడు రోజుకు రూ.250 ఉండగా.. ఇప్పుడు రూ.450కి పెరిగింది. క్లాస్-4 సిబ్బందికి రూ.200 నుంచి 350 వరకు, వీడియో సర్వెలెన్స్ బృందానికి రూ.1,200 నుంచి రూ.3,000లకు పెంచింది. కంట్రోల్ రూమ్/కాల్ సెంటర్ సిబ్బందికి, మైక్రో అబ్జర్వర్లకు రూ.1,000 నుంచి రూ.2,000లకు గౌరవ వేతనం పెరిగింది. పోలింగ్ సిబ్బంది ఆహారం/రిఫ్రెష్మెంట్ రేట్లను రూ.150 నుంచి రూ.500 వరకు ఎన్నికల సంఘం పెంచింది. 2014-16 తర్వాత గౌరవ వేతనాలను సవరించడం ఇదే తొలిసారి.