హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు జిల్లాలో మత్స్యసంపద పెరగడంతో జాలర్లు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. సీఎం కేసీఆర్ హయాంలో చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. నిండు వేసవిలోనూ నీటితో కళకళలాడాయి. దీంతో ప్రభుత్వం అందించిన చేప పిల్లలను వీటిలో విడిచిపెట్టగా నేడు అవి పెరిగి పెద్దయ్యాయి. వనపర్తి జిల్లా కడుకుంట్ల శివారులోని రామసముద్రంలో మత్స్యకారులు సోమవారం సామూహికంగా చేపల వేట సాగించారు. దాదాపు 5 టన్నుల వరకు చేపలు పట్టగా.. ఒక్కో చేప 5 నుంచి 7 కిలోల వరకు ఉండటంతో మత్స్యకారులు సంబురపడ్డారు. వీటిలో రౌట, బంగారు తీగ, బొచ్చ, కొర్రమట్టలు ఉన్నాయి. వీటిని హైదరాబాద్లో విక్రయించేందుకు తరలించారు.