వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం సాగు, తాగునీటి వసతుల కల్పనతో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా గోదావరి జలాలతో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నర్సంపేటలో ‘శాంతి సేన రైతు సంఘం’ నిర్వహించిన పశువుల అందాల పోటీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పాడి పంటలను, పశుసంపదను పెంపొందించడానికి కృషిచేస్తానని అన్నారు. – గోదావరి నది జలాలను పాకాల, రంగాయ చెరువు మదన్నపేట చెరువులో నింపడం వల్ల నియోజకవర్గంలో పంటదిగుబడి పెరిగిందన్నారు. రైతుసంఘాలతో ఎఫ్‌పీవోలను ఏర్పాటుచేసి విత్తన ఉత్పత్తి యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. పంట కొనుగొలు చేపట్టడం, ధాన్యం నిల్వల కోసం లక్ష టన్నుల గోదాoలను ప్రభుత్వం నిర్మించిందని వెల్లడించారు.
ఈ అందాల పోటీలో అన్ని రకాల పశువులు, పెంపుడు జంతువులు, వాటిని పోషించే రైతులు కూడా పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.