హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. వరిపంటను ఎక్కువగా వేయాలని కేంద్ర ప్రభుత్వం మళ్లీ రైతులను గందరగోళ పరుస్తున్నదని ఆయన అన్నారు. ఢిల్లీలో మంగళవారం ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మంద జగన్నాథంతో కలిసి రంజిత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యానికి డిమాండ్ వచ్చిందని మళ్లీ వరిసాగు పెంచాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అంటున్నారని అన్నారు.
90 లక్షల టన్నుల ధాన్యం గోడౌన్లలో నిల్వ ఉన్నదని, దానిని తరలించమంటే నిర్లక్ష్యం చేస్తున్నారని రంజిత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ గవర్నర్ క్షేత్రస్థాయిలో పర్యటించారని, ఆమె చెప్తేనన్నా ధాన్యం కొంటారేమోని వ్యాఖ్యానించారు. ఇన్నేండ్లు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే తెలంగాణ రాష్ట్రం అప్పులు తీసుకున్నదని, ఇన్ని రోజులు శభాష్ అన్న కేంద్రం రాత్రికిరాత్రి పరిమితులు విధిస్తామని అంటున్నదని రంజిత్‌రెడ్డి ఆక్షేపించారు.
తెలంగాణ రాష్ట్రం తీసుకున్న అప్పు కట్టలేదా? రీపేమెంట్ చేయలేదా? అని నిలదీశారు. అప్పులన్నీ సరిగానే చెల్లిస్తున్నామని, పరిమితికి లోబడే అప్పులు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ దిగువ స్థానంలో ఉందని కేంద్రమే చెప్తున్నదని అన్నారు. 40 శాతానికి మించి కేంద్రమే 59% అప్పులు తీసుకున్నదని, కేంద్రాన్ని ఎవరు ప్రశ్నించాలని అడిగారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలకు వాడుకోవడం లేదని, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిందని చెప్పారు. జీఎస్టీ పరిహారం మరో ఆరేండ్లు కొనసాగించాలని కోరామని అన్నారు. కేంద్రానికి ఆదాయం వచ్చే జీఎస్టీ సెస్ మాత్రం పొడిగించుకుంటున్నారని, విషపూరితమైన కుట్రతో రాజకీయ కోణంలోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ నిధులకు కూడా కోత విధించాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌ను నడవనీయకుండా వాయిదా వేస్తున్నారని, దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
రాష్ట్రాలు, ప్రజల, విపక్షాల గొంతు నొకే ప్రయత్నం: ఎంపీ వెంకటేశ్ నేతకాని
రాజ్యాంగ విలువలను, సమాఖ్య స్ఫూర్తిని నిర్వీర్యం చేసిన ఘనత మోదీ సర్కారుదేనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని ప్రశ్నించారు. నియంతృత్వానికి మోదీ ప్రభుత్వమే తార్కాణమని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని విశ్వసించామని చెప్పారు. ఇవాళ ఉభయ సభల్లో పరిశీలిస్తే.. విపక్షాలు, రాష్ట్రాలు, ప్రజల గొంతును నొకే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలపై సమాధానం చెప్పాలని కోరామన్నారు. ప్రజల సమస్యలు చర్చించడానికి అవకాశం కల్పించాలని కోరితే సభలను వాయిదా వేస్తున్నారని, ఈ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఎనిమిదేండ్లలో కేంద్రానికి తెలంగాణ రూ.3,65,795 కోట్లు ఇచ్చిందని, ఇదే సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చింది రూ.1,96,448 కోట్లేనని అన్నారు. కేంద్రం తెలంగాణను దేశంలో అంతర్భాగంగా చూడడం లేదని, విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల విషయంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌ను కంట్రోల్‌రూమ్‌గా మార్చి నిరంతరం సమీక్షించారని, స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణతోపాటు బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లో వరదలు వచ్చినప్పుడు మోదీ సర్కార్ స్పందించడం లేదని, రూపాయి కూడా సహాయం చేయలేదని మండిపడ్డారు.