– బీఆర్ఎస్ పాలనలోనే నల్లగొండ అభివృద్ధి
– కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తం
– తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నీలగిరి, ఫిబ్రవరి 05 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నల్లగొండ అభివృద్ధి చెందిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే నల్లగొండను సుందరంగా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన నల్లగొండ పట్టణంలోని 5, 6, 11, 40వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నల్లగొండకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిందేమి లేదని విమర్శించారు. ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జిల్లాకు వచ్చింది ఏమి లేదని అన్నారు. అదే భూపాల్ రెడ్డి హయాంలో జిల్లా బిడ్డల కోసం ఐటీ టవర్ నిర్మించి 25 కంపెనీలను నల్లగొండకు తీసుకువచ్చారని చెప్పారు. డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం, మోడ్రన్ వైకుంఠ ధామాలు, ట్యాంక్ బండ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, విశాలమైన రోడ్లు, పార్కులు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో, నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ మంజూరు చేసిన నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించి కమీషన్లు దండుకున్నారే తప్పా అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి కంట్లో సంతోషం కనిపించగా అదే కాంగ్రెస్ అరాచక పాలనలో ప్రతి ఇంట్లో సంక్షోభం ప్రతి కంట్లో విషాదం తాండవిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలన కాదని ప్రతీకార పాలన అని మండిపడ్డారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు జిల్లా శంకర్, అభ్యర్థులు కంబాలపల్లి కృష్ణ, కందుల లక్ష్మయ్య, పున్న రాజేశ్వరి వెంకన్న, కందూరు దీపిక యుగంధర్ రెడ్డి, దండంపల్లి సత్తయ్య, నల్లగొండ అశోక్, కాలనీవాసులు పాల్గొన్నారు.