మధిర రూరల్, డిసెంబర్ 13 : ఖమ్మం జిల్లా వంగవీడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ అభ్యర్థికి వత్తాసు పలికాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తాను రెండు ఓట్లతో గెలిస్తే ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు ప్రకటించారని ఆవేదన వ్యక్తంచేశారు. వంగవీడులో 11న జరిగిన పోలింగ్ తర్వాత కౌంటింగ్‌లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా తనకు మూడు ఓట్ల మెజారిటీ వచ్చిందని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సిద్దిపోగు ప్రసాద్ రీకౌంటింగ్ కోరినట్టు తెలిపారు.
ఇందులో తనకు 2 ఓట్ల మెజారిటీ వచ్చినా ప్రకటించకుండాప్రసాద్ 4 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేర్కొన్నారు.
రిటర్నింగ్ ఆఫీసర్ జయరాజు శనివారం తమ ఇంటి వద్దకు వచ్చి, తాను తప్పు చేయలేదని, నలుగురు వ్యక్తులను తీసుకొని ఎంపీడీవో కార్యాలయానికి వస్తే బ్యాలెట్ పేపర్లు లెక్కిస్తానని చెప్పారని, తాను నలుగురితో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో సదరు అధికారి బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపారు. ‘నీ ఓటమిని అంగీకరిస్తూ సంతకం పెట్టు, లేదంటే మర్యాదగా ఉండదు’ అని బెదిరించినట్టు చెప్పారు. తనకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆర్వోపై ఫిర్యాదు చేసినట్టు నాగమణి వెల్లడించారు.